ఆనాడు మావగారు ఎన్టీఆర్ ను పదవిలో నుంచి తప్పించి తాను అధికారం చేపట్టడం, దానికి ముందూ తరువాత జరిగిన అనేకానేక కీలక రాజకీయపరిణామాలను, ఆనాటి చేదు జ్ఞాపకాలను ఏపి సిఎం చంద్రబాబు నాయుడు మరిచిపోవాలనుకొంటున్నప్పటికీ వైకాపా నేతలు ఆయనను మరిచిపోనీయకుండా పదేపదే వాటిని గుర్తుచేస్తూ "పిల్లనిచ్చిన మావగారికే వెన్నుపోటు పొడిచారు" అంటూ దెప్పిపొడుస్తుంటారు. దాని వలన వారికి తెదేపాపై పైచెయ్యి సాధించినట్లవుతుంది కనుక వారు ఆవిధంగా చేయడం సహజమేనని సరిపెట్టుకోవచ్చు.
కానీ తెదేపాతోకానీ... చంద్రబాబు నాయుడుతో గానీ ఎటువంటి సంబంధమూ, శత్రుత్వం లేని రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో ఆనాటి చేదు జ్ఞాపకాలను అన్నిటినీ త్రవ్వితీసి సరిగ్గా వచ్చే ఎన్నికలకు ముందు ప్రజలకు చూపించబోతున్నాడు. ఆ సినిమాకు నిర్మాత వైకాపా ఎంపి రాకేశ్ రెడ్డి కాగా, సాక్షి మీడియా, వైకాపా నేతలు దానికి ప్రమోటర్స్ అని చెప్పవచ్చు. ‘ఈ సినిమాకు సంబందించిన వివరాలను రేపు సాక్షి ఛానల్ లో ప్రసారమయ్యే నా ఇంటర్వ్యూలో చెపుతాను చూడండి..” అంటూ రామ్ గోపాల్ వర్మ ఫేస్ బుక్ లో పెట్టిన మెసేజ్ అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఈ సినిమాతో వైకాపాకు ఎటువంటి సంబంధమూ లేదని ఆ పార్టీ నేతలు, అలాగే ఈ సినిమాకు వైకాపాతో, వర్తమాన రాజకీయాలతో ఎటువంటి సంబంధమూ లేదని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొంటున్నపటికీ, వచ్చే ఎన్నికలలో తెదేపాను చావు దెబ్బ తీయడానికే ఆయన చేత వైకాపాయే ఈ సినిమా తీయిస్తోందనేది బహిరంగ రహస్యమే.
అందుకు తగ్గట్లుగానే ఈరోజు వర్మ ఫేస్ బుక్ లో ఒక ఫోటో పోస్ట్ చేశాడు. దానిలో ఎన్టీఆర్ శవం పక్కన లక్ష్మీ పార్వతి విలపిస్తుంటే, చంద్రబాబు నాయుడు పక్కన నిలబడి చూస్తున్నారు. ఆయన వెనుక ఆనాటి తెదేపా నేతలు, ఎమ్మెల్యేలు నిలబడి ఉన్నారు. ఇది ఆనాడు తీసిన నిజమైన ఫొటోయే. కానీ దానిపై పైన నిర్మాత పేరు రాకేష్ రెడ్డి, క్రిందన లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా పేరు, దాని క్రింద తన పేరు వేసుకొన్నాడు.
ఇది చంద్రబాబు నాయుడుని, తెదేపా నేతలను, మంత్రులను రెచ్చగొట్టడమేనని చెప్పక తప్పదు. కనుక దీనిపై తెదేపా నేతలు తీవ్రంగా స్పందిస్తే, వెంటనే వర్మ ఆయన వెనుకే వైకాపా నేతలు కూడా ఘాటుగా స్పందించడం ఖాయం.
మరో విశేషం ఏమిటంటే, “లక్ష్మి’స్ ఎన్టీఆర్ సినిమా తీయడానికి నాకు అపారమయిన బలమిస్తున్న కేవలం ఒకే ఒక శక్తి ఎవరంటే అది NTR అనే వ్యక్తి.. ఆ మహానుభావుడి ఆత్మ రోజూ నా కలలోకి వచ్చి నాకు స్క్రీన్ ప్లే రాయడానికి సహకరిస్తోంది,” అని రామ్ గోపాల్ వర్మ చెప్పుకోవడం.