‘పిచ్చి కుదిరింది అంటే అయితే రోకలి తలకు చుట్టుకొంటా’నన్నట్లు వ్యవహరిస్తుంటారు కొందరు మేధావులు, రాజకీయ నాయకులు. భాజపా అంటే హిందుత్వ పార్టీ అని అందరికీ తెలుసు. కానీ అంత మాత్రాన్న ఎప్పుడో మొఘలులు, నవాబులు, బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన తాజ్ మహల్, చార్మినార్, ఎర్రకోట, పార్లమెంట్ భవనం వంటివన్నీ బానిస చిహ్నాలని..వాటిని కూల్చివేయాలనడం అవివేకమే కాదు...మూర్కత్వం కూడా.
ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు కూడా ఇటువంటి మతమౌడ్యంతోనే అత్యంత పురాతనమైన, ఎంతో చారిత్రిక ప్రాధాన్యమున్న కొండలపై చెక్కబడిన బౌద్ధ విగ్రహాలను బాంబులతో పేల్చివేశారు. ఇప్పుడు మన దేశంలో చారిత్రిక కట్టడాలను కూల్చివేయలంటున్న మత ఛాందసవాదులకు, తాలిబన్లకు తేడా ఏముంది? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
ఇటీవల యోగీ సర్కార్ యూపిలోని ప్రముఖ వారసత్వ కట్టడాల జాబితాను విడుదల చేసింది. దానిలో ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ లేకపోవడంతో భాజపా మతోన్మాదానికి ఇది పరాకాష్ట వంటిదని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఉత్తరప్రదేశ్ లో భాజపా ఎమ్మెల్యే సంగీత సోమ్ కూడా తాజ్ మహల్ గురించి ఇంచుమించు అటువంటి అభిప్రాయమే వ్యక్తం చేయడంతో ప్రతిపక్ష పార్టీలు భాజపాపై, యోగి, మోడీ సర్కార్ లపై తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి.
భారతదేశ ఘన చరిత్రకు అద్దంపడుతూ, దేశ కీర్తి ప్రతిష్టలను దశదిశలా వ్యాపింపజేస్తున్న తాజ్ మహల్ వంటి అద్భుతమైన కట్టడాలకు కూడా మతతత్వ దృష్టితో ఇంత అవివేకంగా మాట్లాడటం భాజపాకే చెల్లునని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి.
ప్రతిపక్షాలు చేస్తున్న ఈ విమర్శలకు తలొగ్గి యూపి సిఎం ఆదిత్యనాథ్ యోగి మీడియాతో మాట్లాడుతూ, “తాజ్ మహల్ ను ఎవరు ఏ ఉద్దేశ్యంతో కట్టినా దానిని నిర్మాణంలో పనిచేసింది భారతీయ కార్మికులే..వారి రక్తం..వారి స్వేదంతోనే తాజ్ మహల్ నిర్మాణం జరిగింది కనుక అది మన జాతీయ వారసత్వ సంపద. దానిని కాపాడేందుకు మా ప్రభుత్వం అన్ని విధాల జాగ్రత్తలు తీసుకొంటోంది. అక్టోబర్ 26న నేను తాజ్ మహల్ సందర్శనకు వెళుతున్నాను,” అని చెప్పి నష్టనివారణ ప్రయత్నాలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు డిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, “మన వారసత్వ చరిత్రను, చారిత్రిక వారసత్వ కట్టడాలను విస్మరించితే మన ఉనికిని, గుర్తింపును కోల్పోతాము,” అని అన్నారు.
అయితే యోగి సర్కార్ మాటలకు, చేతలకు చాలా తేడా ఉందని దాని నిర్ణయాలు తెలియజేస్తున్నాయి. ప్రపంచంలో ఏడూ వింతల్లో ఒకటిగా గుర్తింపు పొందిన తాజ్ మహల్ తమ యూపిలో ఉన్నందుకు గర్వించవలసింది పోయి, దానికి గుర్తించడానికి కూడా ఇష్టపడలేదు.
ఇప్పుడు విమర్శలకు తలొగ్గి తాజ్ మహల్ గురించి ఏదో చెపుతున్నా...దానిలో కూడా ఆయన చరిత్రను అంగీకరించడానికి ఇష్టం లేనట్లే మాట్లాడటం గమనిస్తే, తాజ్ మహల్ పట్ల ఆయన మనసులో ఎటువంటి అభిప్రాయం ఉందో అర్ధమవుతుంది.
అయినా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలను పరిష్కరించలేనప్పుడు ప్రజల దృష్టిని మళ్ళించడానికి ఇటువంటి వివాదాలు, వ్యాఖ్యలు చేయడం రాజకీయ నాయకులకు అలవాటే కదా! అందుకే యోగి సర్కార్ కూడా ఈ మార్గం ఎంచుకొందేమో?