తమిళనాడులో ఖుష్భూ పరిమళిస్తుందా?

October 17, 2017


img

తమిళనాడు లో అధికార అన్నాడిఎంకె, డిఎంకెలను తట్టుకొని కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకోగలుగుతోంది కానీ ఎంత ప్రయత్నం చేసినా అధికారంలోకి రాలేకపోతోంది. జయలలిత మృతి చెందిన తరువాత రాష్ట్రంలో  నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితులలోనైనా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తమ ఉనికిని గట్టిగా చాటుకొని ప్రజల దృష్టిని ఆకర్షించడంలో ఘోరంగా విఫలం అయ్యారు. కనుక ఆ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు తిరునావుక్కరసర్ పై కాంగ్రెస్ అధిష్టానం అసంతృప్తిగా ఉంది. అందుకు మరోకారణం కూడా కనబడుతోంది. రాష్ట్రంలో ఏమాత్రం బలం లేని భాజపా చాలా తెలివిగా పావులు కదుపుతూ ఆ రాష్ట్రంలో నిలద్రొక్కుకొనే ప్రయత్నాలు చేస్తోంది కానీ తమిళనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 25 లక్షల మంది సభ్యులు ఉన్నప్పటికీ, రాష్ట్ర రాజకీయాలలో పార్టీ పట్టు సాధించలేకపోతోంది. కనుక పిసిసి అధ్యక్షుడిని మార్చాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. 

సినీ,టీవి నటిగా తమిళనాడులో మంచి ప్రజాధారణ ఉన్న ఖుష్భూను పిసిసి అధ్యక్షురాలిగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె కూడా తాను ఆ పదవి చేపట్టేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. ఈనెల 21 నుంచి మూడు రోజులపాటు డిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం జరుగబోతున్నాయి. ఆ సమావేశాలలోనే తమిళనాడుతో సహా ఆరు రాష్ట్రాలకు కొత్త పిసిసి అధ్యక్షులను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పార్టీ జాతీయ అధ్యక్షుడుగా రాహుల్ గాంధీని ఎన్నుకోబోతున్నారు. 


Related Post