రాష్ట్ర పురపాల శాఖా మంత్రి కేటిఆర్ మొన్న వరంగల్ రూరల్ జిల్లా పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ ఆమ్రపాలి, మున్సిపల్ కమీషనర్, నగర మేయర్ తదితరులపై ఆగ్రహించినట్లు ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక పేర్కొంది. ఆ సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారని పేర్కొంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు రూ.300 కోట్లు కేటాయించి, అనేక అభివృద్ధి పనులను పూర్తిచేయమని ఆదేశిస్తే, అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పనులు పూర్తి చేయడంలేదని మంత్రులు కేటిఆర్, కడియం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారని ఆ పత్రిక పేర్కొంది. అప్పుడు కలెక్టర్ ఆమ్రపాలి చేతులు జోడించి కేటిఆర్ ను వేడుకొన్నారని ఆ పత్రిక పేర్కొంది.
మళ్ళీ అదే పత్రిక..అదే వార్తలో ‘జిల్లాకు నిధులు లేవు..సరిపడినంతమంది ఉద్యోగులు లేరని, మరి అభివృద్ధి పనులు ఏవిధంగా పూర్తి చేయగలము?’ అని అధికారులు మధనపడుతున్నట్లు వ్రాసింది. అంటే వరంగల్ రూరల్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.300 కోట్లు ప్రభుత్వం విడుదల చేయలేదని చెపుతున్నట్లు అర్ధం అవుతోంది.
ఇది ఎలా ఉందంటే ప్రభుత్వం జిల్లాకు నిధులు విడుదల చేసిందో లేదో తెలుసుకోకుండానే ఇద్దరు మంత్రులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెప్పుతున్నట్లుంది. ఒకవేళ నిధులు విడుదల చేయకపోయుంటే ఎందుకు పనులు పూర్తికావడం లేదని వారు అధికారులను గట్టిగా ప్రశ్నించగలరా? నిధులు విడుదల చేస్తున్నప్పుడు, పనులు జరుగకపోతే అధికారులను నిలదీయకుండా ఉంటారా? ఒక సమీక్షా సమావేశంలో మంత్రులు, అధికారులకు మద్య జరిగిన చర్చలను చర్చలుగానే చూడాలి తప్ప వాటిపై మీడియా కూడా రాజకీయాలు చేయడం అవసరమా?
జిల్లాలో అభివృద్ధి పనులు జరగడం లేదని మంత్రి కేటిఆర్ అన్న మాటను పట్టుకొని అప్పుడే ప్రతిపక్షాలు యుద్ధం ప్రకటించేసాయని కనుక మంత్రి కేటిఆర్ ఆవిధంగా మాట్లాడం ద్వారా సెల్ఫ్ గోల్ చేసుకొన్నారని, దాని వలన జిల్లాలో తెరాస ఎమ్మెల్యేలు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆ పత్రిక పేర్కొంది.
మంత్రులు జిల్లాలలో జరుగుతున్న పనులపై సమీక్షలు చేసినప్పుడు, అధికారులను ప్రశ్నించడం, పనులను వేగవంతం చేయమని చెప్పడం, సరిగ్గా చేయలేకపోతుంటే కాస్త మందలించడం సర్వసాధారణమైన విషయాలే. కేటిఆర్, కడియం కూడా సమీక్షా సమావేశంలో అదే చేశారు తప్ప అనూహ్యమైనవేవీ చేయలేదని అర్ధం అవుతూనే ఉంది. కానీ వరంగల్ లో అభివృద్ధిపనులు ఎందుకు జరగడం లేదని మంత్రులు అడిగితే, తెరాస నేతలు, అధికారులు ఇబ్బందిపడుతున్నారని, ఆవిధంగా అడగడం బ్యాక్ ఫైర్ అయినట్లేనని చెప్పడం చాలా హాస్యస్పదంగా ఉంది కదా?