టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ గత మూడేళ్ళుగా తెరాస సర్కార్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ, మొదట్లో తెరాస బదులిచ్చేది కాదు. తెలంగాణా సాధన కోసం పోరాడిన కారణంగా ఆయనపై తెరాసకున్న గౌరవం చేత లేదా ప్రజలలో ఆయనకు గౌరవం, ఆదరణ చూసి ఉపేక్షించి ఉండవచ్చు. కానీ ఈ మూడేళ్ళలో ఆయన ఒక ప్రతిపక్షనాయకుడిలాగ మారి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తూ, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే విధంగా ప్రజా పోరాటాలు చేస్తుండటంతో తెరాస కూడా ఆయనను ప్రతిపక్షనాయకుడిగానే భావించి ఎదురుదాడి చేయడం మొదలుపెట్టింది.
మొదట ఆయనపై ‘కాంగ్రెస్ ముద్ర’ వేయడం ద్వారా అందుకు వీలు కల్పించుకొంది. ఆయన మేధావి ముసుగులో కాంగ్రెస్ పార్టీ ఏజంటుగా మాట్లాడుతున్నారని, ఆ పార్టీ తరపున తమ ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని తెరాస నేతలు ప్రతివిమర్శలు చేస్తున్నారు.
ప్రొఫెసర్ కోదండరామ్ తన ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేస్తున్నా సహించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఇటీవల సింగరేణి ఎన్నికలలో అయన చేసిన ఆరోపణలతో సహనం కోల్పోయి నేరుగా అయన పేరుపెట్టి విమర్శించడం, ‘దమ్ముంటే ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి తనను దుర్కోవాలని సవాలు విసరడం’ అందరికీ తెలుసు. కోదండరామ్ ఆ సవాలును స్వీకరించలేదు కానీ తెరాస సర్కార్ పై తన విమర్శలను, పోరాటాలను మరింత తీవ్రతరం చేశారు.
టిజెఎసి నేతృత్వంలో మొన్న తలపెట్టిన తెలంగాణా అమరవీరుల స్పూర్తియాత్రను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకోవడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై మళ్ళీ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణాలో తెరాస క్రమంగా బలహీనపడుతోందని అందుకే అది తమను అడ్డుకొందని ఆరోపించారు. టిజెఎసి కార్యకర్తలపై పోలీసులు అక్రమకేసులు బనాయించి వేధిస్తున్నారని ఆరోపించారు. తెరాస సర్కార్ నియంతృత్వ వైఖరి, అప్రజాస్వామిక విధానాల గురించి గవర్నర్ నరసింహన్ కు, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు పిర్యాదు చేస్తామన్నారు. దీనిపై త్వరలోనే న్యాయపోరాటం కూడా మొదలుపెడతామని హెచ్చరించారు.
ప్రొఫెసర్ కోదండరామ్ తీరును రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి తప్పు పట్టారు. ఆదివారం మహబూబ్ నగర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కోదండరామ్ పై ఆయన మరో సరికొత్త ఆరోపణ చేశారు. ఆయనకు కాంగ్రెస్ తో బాటు నక్సల్స్ తో కూడా సంబంధాలున్నాయని ఆరోపించారు.
“ప్రొఫెసర్ కోదండరామ్ మొన్న నన్ను కలిసినప్పుడు పోలీసుల అనుమతిస్తేనే స్ఫూర్తియాత్రలు చేసుకోవచ్చని చెప్పాను. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడవలసిన బాధ్యత మాపై ఉంది. రాష్ట్రంలో అరాచక శక్తులకు తావు లేదు. అయన కాంగ్రెస్, నక్సల్స్ తో కలిసి మా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధికి ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మా ప్రభుత్వం వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగిపోతోంది,” అని నాయిని అన్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ పై తెరాస వేసిన ఈ సరికొత్త ‘నక్సల్ ముద్ర’ను ఆయన...తెలంగాణా ప్రజలు ఏవిధంగా స్వీకరిస్తారో?