కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు తన కొడుకు రాహుల్ గాంధీ త్వరలో పార్టీ పగ్గాలు చేప్పట్టబోతున్నాడని చెప్పేరు. ఆయన పార్టీ పగ్గాలు చేపట్టడానికి పార్టీలోనే కొందరు సీనియర్ నేతలు అభ్యంతరాలు చెపుతున్నారు. అటువంటివారి నోళ్ళు మూయించడానికే ఆమె స్వయంగా ఈ ప్రకటన చేసి ఉండవచ్చు. ఈ నిర్ణయానికి మరో బలమైన కారణం కూడా కనిపిస్తోంది.
త్వరలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈసారి భాజపాకు కంచుకోట వంటి గుజరాత్ లో భాజపాకు ఎదురు గాలి వీస్తోంది. ఒకవేళ అదృష్టం కలిసి వచ్చి ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ భాజపాను ఓడించగలిగితే, అది ప్రధాని మోడీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాల ఓటమిగానే భావించబడుతుంది. ఆ క్రెడిట్ రాహుల్ గాంధీకి దక్కితే ఆయన మళ్ళీ సగర్వంగా తల్లెత్తుకోగలరు. అప్పుడు ఇక రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాలను ఎవరూ ప్రశ్నించ(లే)రు. కనుక ఆ ఎన్నికల కంటే ముందుగానే కొడుకుకు పార్టీ పగ్గాలు అప్పగించాలని సోనియా గాంధీ భావించడం సరైన నిర్ణయమేనని చెప్పవచ్చు.
ఒకవేళ గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీకి కొత్తగా వచ్చే నష్టం ఏమీ ఉండదు. ఎందుకంటే దానికి ఓటములు ఎంతగా అలవాటయిపోయాయంటే వాటి గురించి బాధపడటం కూడా మానేశారు కాంగ్రెస్ నేతలు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఆ క్రెడిట్ రాహుల్ గాంధీ పద్దులో వ్రాయబడుతుంది. ఓడిపోతే అది కాంగ్రెస్ పద్దులో వ్రాసుకోబడుతుందని అందరికీ తెలుసు. కానీ అప్పటికే పార్టీ పగ్గాలు రాహుల్ గాంధీ చేతిలో ఉంటాయి కనుక పార్టీలో ఎవరూ నోరెత్తలేరు. కనుక వీలైనంత త్వరగానే రాహుల్ గాంధీకి పట్టాభిషేకం జరిపించేయవచ్చు. దీపావళి పండుగ తరువాత ఆ కార్యక్రమం ఉండవచ్చని కాంగ్రెస్ వర్గాలు అనుకొంటున్నాయి.