గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించవలసిన కేంద్ర ఎన్నికల కమీషన్, మొన్న హిమాచల్ ప్రదేశ్ ఒక్కదానికే ప్రకటించడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనెల 16న ప్రధాని నరేంద్ర మోడీ గాంధీనగర్ లో బారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ సభలో ప్రధాని నరేంద్ర మోడీ అనేక వరాలు ప్రకటించి గుజరాత్ ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నిస్తారని కాంగ్రెస్ వాదిస్తోంది. ఒకవేళ గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినట్లయితే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది కనుక ఆయన వరాలు ప్రకటించదానికి వీలుపడదు అందుకే ఆ సభ ముగిసేవరకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకుండా కేంద్రప్రభుత్వమే ఎన్నికల కమీషన్ పై ఒత్తిడి తెచ్చినట్లు అనుమానిస్తున్నామని మాజీ కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి సూర్జేవాలా ఆరోపించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమీషన్ ఈవిధంగా కేంద్రం ఒత్తిడికి లొంగి ఎన్నికల షెడ్యూల్ వాయిదా వేయడం శోచనీయమని అన్నారు. ప్రస్తుతం గుజరాత్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రాహుల్ గాంధీకి ప్రజల నుంచి వస్తున్న అపూర్వమైన ఆదరణ చూసి భాజపా బెంబేలెత్తిపోతోందని వారు ఎద్దేవా చేశారు. ఇకనైనా ఎన్నికల కమీషన్ తక్షణం గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
సాధారణంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించుతున్నప్పుడు, ఎన్నికల కమీషన్ అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తుంటుంది. కానీ మొదటిసారిగా హిమాచల్ ప్రదేశ్ కు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి, గుజరాత్ కు ప్రకటించలేదు. అందుకు ఎన్నికల కమీషన్ బలమైన, సంతృప్తికరమైన కారణాలు కూడా చెప్పలేకపోయింది. కనుక కాంగ్రెస్ ఆరోపణలు నిజమేనని అనుమానించక తప్పదు.