కోదండరామ్ అరెస్ట్

October 14, 2017


img

టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్, జనగాం జిల్లాల నుంచి ఈరోజు టిజెఎసి అమరవీరుల స్ఫూర్తి యాత్ర ప్రారంభించాలనుకొంది. దాని కోసం టిజెఎసి నేతలు పోలీసులకు ముందుగానే దరఖాస్తు చేసుకొన్నప్పటికీ వారు అనుమతించలేదు. ఈరోజు ఉదయం వరంగల్, జనగామ జిల్లాలలో 20 మంది టిజెఎసి కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. వారిని అరెస్ట్ చేయడం పట్ల ప్రొఫెసర్ కోదండరామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారం గురించి హోంమంత్రి నాయిని నరసింహారెడ్డిని స్వయంగా కలిసి పిర్యాదు చేశారు. తమ స్ఫూర్తియాత్రను అనుమతించవలసిందిగా కోరినప్పటికీ అయన సానుకూలంగా స్పందించలేదు. అయినప్పటికీ ప్రొఫెసర్ కోదండరామ్ స్ఫూర్తి యాత్రను కొనసాగించడానికి తన అనుచరులతో కలిసి హైదరాబాద్ నుంచి వరంగల్ బయలుదేరడంతో వారిని పోలీసులు ఘట్ కేసర్ జీడిమెట్ల వద్ద అడ్డుకొని అదుపులోకి తీసుకొన్నారు. వారిని కీసర పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే పోలీసులను పెట్టి తమ స్పూర్తియాత్రను ప్రభుత్వం అడ్డుకోవడం సరికాదని, తాము స్పూర్తియాత్రను తప్పకుండా నిర్వహించి తీరుతామని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.  

ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో టిజెఎసి తలపెట్టిన అమరవీరుల స్ఫూర్తి యాత్రను ప్రభుత్వం అడ్డుకోవలసిన అవసరం ఏమిటో తెలియదు. తద్వారా రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను బలపరుస్తున్నట్లవుతోందని గ్రహించాలి. పైగా తెలంగాణా సాధన కోసం పోరాడిన వ్యక్తిగా ప్రొఫెసర్ కోదండరామ్ కు కూడా సమాజంలో చాలా గౌరవం ఉంది. కనుక ఆయన పట్ల అనుచితంగా వ్యవహరించడం వలన ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత ఏర్పడే ప్రమాదం ఉందని చెప్పకతప్పదు. 

ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించినట్లుగా ప్రొఫెసర్ కోదండరామ్ కూడా తెరాస సర్కార్ ను గుడ్డిగా వ్యతిరేకించడం, విమర్శించడం వలన ప్రజలలో తానే పలుచన అవుతారని గ్రహించడం మంచిది. తెలంగాణా కోసం పోరాడిన ఇద్దరు ప్రముఖులు ఇప్పుడు ఈవిధంగా ఒకరిపై మరొకరు కత్తులు దూసుకోవడం వారిరువురిలో ఎవరు చెపుతున్నది నిజమో..ఎవరి మాటలను విశ్వసించాలనే అయోమయం సృష్టిస్తున్నట్లవుతోంది. 


Related Post