వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, అందుకు పార్టీ మూల్యం చెల్లించడం పరిపాటిగా మారింది.
ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తన ఎంపిల చేత రాజీనామాలు చేయిస్తానని జగన్ తొందరపడి ప్రకటించారు. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో ఆయన తెదేపాను తప్పుపట్టినప్పుడల్లా, ‘ఇంతవరకు మీ ఎంపిల చేత రాజీనామా ఎందుకు చేయించలేదు? అంటే మీకు చిత్తశుద్ధి లేదనే కదా దానర్ధం?’ అంటూ తెదేపా నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. వారికి ఆ అవకాశం కల్పించింది జగనే అని చెప్పక తప్పదు.
తరువాత నవంబర్ 2వ తేదీ నుంచి ఆరు నెలలపాటు ఏపిలో 3,000 కిమీ పాదయాత్ర చేస్తానని జగన్ హడావుడిగా ప్రకటించేశారు. కానీ ముందుగా దానికి సిబిఐ కోర్టు అనుమతి తీసుకోకపోవడం వలన ఇప్పుడు పాదయాత్ర మొదలుపెట్టగలరో లేదో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.
రాజకీయ నాయకుడినైన తాను ఆరు నెలలు పాదయాత్ర చేయాలనుకొంటున్నానని, కనుక తనకు అక్రమాస్తుల కేసుల విచారణలో ఆరు నెలలపాటు వ్యక్తిగత మినహాయింపునివ్వలాని కోరుతూ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ వేశారు. దానిపై సిబిఐ తరపు న్యాయవాది తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఆ కేసులలో నిందితుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి, ప్రతీవారం తప్పనిసరిగా కోర్టు విచారణకు హాజరుకావాలనే షరతు మీదే బెయిలు మంజూరుచేసిన సంగతిని సిబిఐ న్యాయస్థానానికి సిబిఐ న్యాయవాది గుర్తుచేసి, జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత మినహాయింపు ఈయవద్దని గట్టిగా వాదించారు. ఈవిధంగా ఏదో ఒక సాకుతో ఆయన ఈ కేసుల విచారణను ఎన్నటికీ పూర్తికాకుండా సాగదీస్తూ తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారని సిబిఐ న్యాయవాది వాదించారు. ఇరు పక్షాల వాదనలు న్యాయమూర్తి విన్న తరువాత ఈ కేసు విచారణను అక్టోబర్ 20వ తేదీకి వాయిదా వేశారు.
ఒకవేళ సిబిఐ కోర్టు ఈ కేసులలో జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తే ఆయన పాదయాత్రకు ఎటువంటి ఆటంకం ఉండదు కానీ తప్పనిసరిగా ప్రతీ శుక్రవారం కేసుల విచారణకు హాజరు కావాలని ఆదేశించినట్లయితే ఆయన పాదయాత్ర చేయడం అనుమానమే. తొందరపడి ఏదో ఒకటి ప్రకటించేయడం ఆ తరువాత ఈవిధంగా ఇబ్బందులు ఎదుర్కోవడం జగన్మోహన్ రెడ్డికి పరిపాటిగా మారినట్లు కనిపిస్తోంది.