వర్మకు వాణీ విశ్వనాథ్ వార్నింగ్

October 13, 2017


img

ఆలూ లేదు చూలూ లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్లు సాగుతోంది వర్మ-తెదేపా నేతల మద్య జరుగుతున్న మాటల యుద్ధం. ఈరోజు అలనాటి అందాల నటి వాణీ విశ్వనాథ్ కూడా ఈ ఫైట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

“ఎన్టీఆర్ వీరాభిమానిగా, ఆయన సినిమా ఆఖరి హీరోయిన్ గా చెబుతున్నా..ఎన్టీఆర్ బయోపిక్ ను తెరకెక్కించే ప్రయత్నం రాంగోపాల్ వర్మ వెంటనే మానుకోవాలి. ఎన్టీఆర్ పేరుకు కళంకం తెచ్చేలా సినిమా తీస్తే ఎన్టీఆర్ అభిమానులతో కలిసి రాంగోపాల్ వర్మ ఇంటి ముందు ధర్నాకు దిగుతా,” అని ట్విట్టర్ ద్వారా  హెచ్చరించింది. ఆమెకు వర్మ చాలా సరదాగా జవాబు చెప్పాడు. “వాణి గారు, నా ఇంటి ముందు ధర్నా చేయడానికి నాకసలు ఇల్లే లేదు. రోడ్ల మీద తిరుగుతూ ఉంటా....అప్పుడు మీరు కూడా నన్ను వెతుక్కుంటూ రోడ్ల మీద తిరిగితే సున్నితమైన మీ పాద పద్మములు కమిలిపోవూ?” అని ట్వీట్ చేశాడు.

ఇంతకీ వాణీ విశ్వనాథ్ ఈ గొడవలో ఎందుకు తలదూరుస్తున్నారంటే, ఆమె త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరాలనుకొంటున్నారు. చంద్రబాబు నాయుడు నుంచి తనకు ఆహ్వానం కూడా అందిందని చెప్పుకొన్నారు. ఆయన ఆదేశిస్తే అలనాటి తన సహనటి వై.ఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజాపై వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్దం అని ప్రకటించారు కూడా. కానీ ఇంకా పార్టీలో చేరక మునుపే ఆ పార్టీ నేతలాగ ఫీల్ అయిపోతూ రామ్ గోపాల్ వర్మతో యుద్ధానికి దిగడం విడ్డూరంగా ఉంది. 


Related Post