వైశ్యులు సమాజాన్ని దోచుకొనేవారని వర్ణిస్తూ కంచె ఐలయ్య వ్రాసిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అనే పుస్తకంపై రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంత రగడ జరుగుతోందో అందరూ చూస్తూనే ఉన్నారు. ఆ పుస్తకం ద్వారా ఆయన తమను కించపరిచేవిధంగా వర్ణించి తమ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారని, కనుక ఆ పుస్తకాన్ని నిషేదించాలని కోరుతూ ప్రముఖ న్యాయవాది మరియు ఆర్య వైశ్య సంఘం నేత రామాంజనేయులు క్రిందటి నెల సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం దానిపై ఈరోజు విచారణ జరిపి, ఆ పిటిషన్ ను కొట్టివేసింది. ఈ సందర్భంగా జస్టిస్ దీపక్ మిశ్రా ఈ వివాదంపై తమ అభిప్రాయం చెపుతూ, “ఆ పుస్తకాన్ని నిషేదించినట్లయితే ఆయన భావప్రకటన స్వేచ్చను హరించినట్లు అవుతుంది. దానిపై వివాదం చెలరేగిందనే కారణంతో దానిని నిషేధం విధించలేము. అది రాజ్యంగా విరుద్దం. అయితే సున్నితమైన అంశాలపై వ్రాస్తున్నప్పుడు రచయితలు స్వీయ నియంత్రణ పాటించవలసిన అవసరం కూడా ఉంది,” అని అన్నారు.
దీనిపై అందరి కంటే ముందుగా కంచె ఐలయ్య స్పందిస్తూ,” సుప్రీంకోర్టు తీర్పును నేను స్వాగతిస్తున్నాను. వాస్తవానికి తమపై ఒక పుస్తకం వచ్చినందుకు కోమట్లు సంతోషించాలి..గర్వించాలి,” అని వారి పుండు మీద కారం చల్లినట్లు మాట్లాడారు.
రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు సరైనదే కానీ అదే రాజ్యాంగంలో ఒకరి భావప్రకటన స్వేచ్చ మరొకరి స్వేచ్చకు, ప్రాధమిక హక్కులకు భంగం కలిగించకూడదని కూడా స్పష్టంగా ఉంది. ఐలయ్య హక్కులను సుప్రీంకోర్టు కాపాడినప్పుడు ఆయన వలన ఇతరుల స్వేఛ్చకు భంగం కలగకుండా కాపాడటానికి ఆయనను నియంత్రించి ఉండి ఉంటే బాగుండేది కదా! ఆయన విషయంలో సుప్రీంకోర్టులో ఆర్యవైశ్యులకు చుక్కెదురైంది కనుక ఇప్పుడు వారు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.