వర్మపై తెదేపా దాడి షురూ?

October 13, 2017


img

రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తీస్తానని ప్రకటించగానే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నట్లు తెదేపాలో కంగారు మొదలైంది. అయితే వెంటనే దాని గురించి ఏదో ఒకటి మాట్లాడేయకుండా కాస్త సంయమనం పాటించడం వలన, వారు దానిని విమర్శించదానికి అవసరమైన ‘మెటీరియల్’ ను వర్మే స్వయంగా అందించాడు. 

తన సినిమాకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే పేరు పెట్టి, దానిలో తాను ఏమి చూపించబోతున్నాడో, ఎవరిని టార్గెట్ చేసుకొబోతున్నాడో, ఎప్పుడు విడుదల చేయబోతున్నాడో అన్నీ వర్మ స్వయంగా చెప్పేడు. తరువాత ఆ సినిమాకు వైకాపా నేత రాకేశ్ రెడ్డి నిర్మించబోతున్నట్లు ప్రకటించడంతో ఇక తెదేపా నేతలు దాని గురించి మాట్లాడేందుకు తడుముకోవలసిన అవసరం లేకుండా చేశాడు. 

కనుక తెదేపా నేతలు మెల్లగా వర్మపై ఎదురుదాడి మొదలుపెట్టేరు. ముందుగా తెదేపా మహిళా నాయకులలో  ఫైర్ బ్రాండ్ గా పేరొందిన ఎమ్మెల్యే అనిత అతనిపై నిన్న తొలి అస్త్రం సందించారు. ఆమె నిన్న మీడియాతో మాట్లాడుతూ, “ఎన్టీఆర్ జీవితం ఒక తెరిచిన పుస్తకం వంటిది. కనుక ఎవరైనా ఆయనపై సినిమా తీయవచ్చు. అయితే అది ఆయన గొప్పదనాన్ని చాటే విధంగా ఉండాలి తప్ప ఆయనకు, ఆయన స్థాపించిన పార్టీకి అప్రదిష్ట కలిగించేవిధంగా సినిమాలు తీస్తామంటే ఎన్టీఆర్ అభిమానులు సహించరు.. తెదేపా కార్యకర్తలు సహించరని గుర్తుంచుకోవాలి,” అని వర్మను పరోక్షంగా హెచ్చరించారు. 

తరువాత ఈరోజు ఏపి మంత్రి అమర్ నాథ్ రెడ్డి చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ, “ఆయన (రామ్ గోపాల్ వర్మ) ఎలాంటివాడో తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఆయనే తీసే సినిమాలతో ప్రజలు ప్రభావితం అయిన దాఖలాలు లేవు. ఆయన ఎప్పుడూ ఏదో సంచలనం లేదా వివాదం సృష్టించేందుకు ఏదో చేస్తుంటాడు. అతను ఏమి చేస్తాడో అతనికే తెలియదు. ఇక ఆ సినిమాను తీస్తున్న రాకేశ్ రెడ్డి ఎవరో నాకు తెలియదు. వ్యాపారమే పరమావధిగా తీసే సినిమాలపై తెదేపా స్పందించవలసిన అవసరం లేదు,” అని అన్నారు. 

ఎమ్మెల్యే అనిత ‘తెదేపాకు ఇబ్బంది కలిగించే విధంగా’ సినిమా తీస్తే సహించమని చెప్పడాన్ని ‘చంద్రబాబుకు ఇబ్బంది కలిగించే విధంగా’ అని అర్ధం చేసుకోవలసి ఉంటుంది. ఇక మంత్రి అమర్ నాథ్ రెడ్డి ఇటువంటి సినిమాపై స్పందించనవసరం లేదంటూనే మళ్ళీ వర్మ గురించి, ఆ సినిమా గురించి మాట్లాడటం గమనిస్తే ఈ సినిమా తెదేపాకు చాలా ఆందోళన కలిగిస్తోందని సూచిస్తోంది. బహుశః మున్ముందు ఈ సినిమాపై వర్మ, వైకాపా-తెదేపాల మద్య పెద్ద యుద్ధమే జరుగవచ్చు. 


Related Post