భాజపా పాలిత గుజరాత్, కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల శాసనసభలకు 2018, జనవరితో గడువు ముగియనున్నందున, ఆ రెండు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమీషన్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబోతోంది. ఆ ప్రకటన వెలువడిన మరుక్షణం నుంచి ఆ రెండు రాష్ట్రాలలో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది.
ఈసారి ఆ రెండు రాష్ట్రాలలో అధికార పార్టీలకు చాలా విపత్కర పరిస్థితులు నెలకొని ఉన్నాయి. గుజరాత్ లో పటేల్ కులస్థులకు రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన హార్దిక్ పటేల్ పై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వేధింపులకు పాల్పడటంతో అతను శివసేనతో చేతులు కలపడానికి సిద్దపడ్డాడు. రిజర్వేషన్ విషయంలో తమకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని భావిస్తున్న పటేల్ కులస్తులు ఈసారి కాంగ్రెస్ లేదా శివసేనలవైపు మొగ్గు చూపవచ్చు. అలాగే గోరక్షక్ పేరుతో రాష్ట్రంలో దళితులపై జరిగిన దాడుల కారణంగా ఆ వర్గం ప్రజలు కూడా భాజపా సర్కార్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కనుక ఈ రెండువర్గాల ప్రజలు ఒకవేళ భాజపాకు ఈ ఎన్నికలలో హ్యాండ్ ఇస్తే గుజరాత్ లో భాజపా యుగం పరిసమాప్తం అయినట్లే భావించవచ్చు. కనుక ఈ ఎన్నికలు భాజపాకు అగ్నిపరీక్ష వంటివేనని భావించవచ్చు.
ఇక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దానికి అవినీతి ఆరోపణలు, సిబిఐ కేసులు ఎదుర్కొంటున్న వీరభద్రసింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ఎన్నికలలో కూడా ఆయనే తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి అని రాహుల్ గాంధీ ప్రకటించడం వ్యూహాత్మకంగా పెద్ద తప్పేనని అర్ధం అవుతోంది. అయితే అయన ఎంత అవినీతిపరుడైనప్పటికీ రాష్ట్రంలో ఆయన మాత్రమే పార్టీని మళ్ళీ గెలిపించుకొని తన అధికారం నిలబెట్టుకోగలరని కాంగ్రెస్ అధిష్టానం భావించడంతో ఆయనకే ఆ బాధ్యతలు అప్పగించింది.
సరిగ్గా అదే భాజపాకు కలిసివస్తోంది. అవినీతిపరుడైన ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ వెనకేసుకువస్తోందని, మళ్ళీ అతనికే అధికారం కట్టబెడితే ఆయన రాష్ట్రాన్ని దోచుకొంటారని గట్టిగా ప్రచారం చేసుకొని ప్రజలను తమవైపు తిప్పుకొనే అవకాశం లభిస్తోంది. కనుక ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు గడ్డుపరీక్ష వంటివేనని చెప్పవచ్చు. ఆ రెండు పార్టీల వ్యూహాలు, లెక్కలు ఫలించినట్లయితే ఈసారి గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ, హిమాచల్ ప్రదేశ్ లో భాజపా అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యం లేదు.