ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా సిటీ హైదరాబాద్ శివార్లలో రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల సమీపంలో రాబోతోంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ఫార్మాసిటీ (హెచ్ పీసీ)గా నామకరణం చేసింది. దాని ఏర్పాటు కోసం నిన్న ప్రజాభిప్రాయ సేకరణ సమావేశంలో రాష్ట్ర ఐటి మరియు పరిశ్రమల శాఖా మంత్రి కేటిఆర్ ఫార్మా సిటీ గురించి వివరిస్తూ, “మొదట మేము దీనిని 6,000 ఎకరాలలో ఏర్పాటు చేద్దామనుకొన్నాము కానీ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఫార్మా కంపెనీలన్నీ ఒకే చోట ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో 15,000 ఎకరాలలో ఏర్పాటు చేయాలని నిర్ణయించాము. ఇదే ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఫార్మా సిటీ అవుతుంది.
దీనిలో దేశవిదేశాలకు చెందిన అనేక కంపెనీలు రూ.64,000 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. వాటి ద్వారా సుమారు 4.20 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలకు ముందు చూపులేకపోవడం వలన నగరం నలువైపులా కాలుష్యం వెదజల్లే పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశాయి. కానీ మేము ఏర్పాటు చేయబోయే ఫార్మా సిటీలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి కాలుష్య నివారణ చర్యలు చేపడతాము. ఆ రంగంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన 8 సంస్థలు ఫార్మా సిటీని పర్యావరణహితంగా మార్చేందుకు ముందుకు వచ్చాయి.
ఈ ఫార్మా కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు అందరూ కూడా అక్కడే నివసించేందుకు వీలుగా ఫార్మా సిటీలోనే రెసిడెన్షియల్ టౌన్ షిప్ ను కూడా డిజైన్ చేస్తున్నాము. అంటే అక్కడ ఎన్ని ఫార్మా కంపెనీలు వచ్చినా ఏమాత్రం కాలుష్యం ఉండదని చెప్పడానికి అదే గొప్ప నిదర్శనంగా నిలుస్తుంది. కనుక ఫార్మా సిటీ ఏర్పాటు అవుతున్న ప్రాంతాలలో ప్రజలు, రైతులు ఆందోళన చెందనవసరం లేదు.
ఇక్కడ ఏర్పాటు చేయబోయే కంపెనీలలో కేవలం 24 శాతం మాత్రమే రెడ్ కేటగిరీకి చెందినవి. మిగిలినవన్నీ సురక్షితమైన ఆరెంజ్ కేటగిరీకి చెందినవే. ఇక ఈ ఫార్మా సిటీలో 33 శాతం అంటే 4,950 ఎకరాల భూమిని కేవలం పచ్చదనం పెంచడం కోసమే కేటాయిస్తున్నాము. దానిలో రకరకల చెట్లను పెంచి చుట్టూ అడవిలా తయారుచేస్తాం. ఇక ఈ ఫార్మసిటీలోని కంపెనీల నుంచి ఒక్క లీటరు నీటిని కూడా బయట చెరువులకి పోనివ్వకుండా శుద్ధి చేసి మళ్ళీ వినియోగించే టెక్నాలజీని ఉపయోగించబోతున్నాము. అలాగే మిషన్ కాకతీయ పధకంతో మా ప్రభుత్వం చెరువులలో పూడిక తీసి మంచినీళ్ళతో వాటిని నింపుతున్న సంగతి తెలిసిందే. కనుక ఫార్మా సిటీ క్రింద ఒక్క చెరువుకూడా పోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటాము. అలాగే ఫార్మా సిటీలో ఒక్క బోరు కూడా వేయకుండా మిషన్ భగీరథ ద్వారానే ఫార్మా సిటీకి అవసరమైనంత నీటిని సరఫరా చేస్తాము. కనుక స్థానిక ప్రజలు, నిర్వాసిత రైతులు అందరూ ఈ ఫార్మాసిటీ ఏర్పాటు కోసం మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను,” అని కేటిఆర్ అన్నారు.