వరంగల్ ప్రజలు ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్న కాకతీయ టెక్స్ టైల్ పార్క్ కు ఈనెల 20న ముఖ్యమంత్రి కేసీఆర్ శంఖుస్థాపన చేయబోతున్నారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈవిషయం నిన్న వెల్లడించారు. ఈ మెగా టెక్స్ టైల్ పార్క్ కు ఆగస్ట్ నెలలోనే శంఖుస్థాపన చేయాలనుకొన్నారు. కానీ పార్క్ కు సంబందించిన కొన్ని పనులు సకాలంలో పూర్తికాకపోవడంతో శంఖుస్థాపన కూడా ఆలస్యమయినట్లు తెలుస్తోంది. అవి పూర్తవడంతో ముహూర్తం ఖరారు చేసేశారు.
వరంగల్ జిల్లాలో సంగెం మండలంలోని చింతపల్లి-గీసుకొండ మండలంలోని శ్యాం పేట గ్రామాల మద్య గల 1,190.67 ఎకరాలలో ఈ మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయబడుతుంది. దీనికి మొత్తం రూ.11,000 కోట్లు పెట్టుబడి అవసరం ఉంటుందని అంచనా వేశారు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం పద్దతిలో నిధుల సమీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు కోసం రాష్ట్ర చేనేత శాఖ మంత్రి కేటిఆర్ ఇదివరకే తమిళనాడులో పర్యటించి, అక్కడ పలు టెక్స్ టైల్ పరిశ్రమలను సందర్శించారు. అక్కడ విజయవంతంగా టెక్స్ టైల్ పరిశ్రమలు నడిపిస్తున్న పలువురు పారిశ్రామికవేత్తలతో ఆయన మాట్లాడి, వారిని వరంగల్ లో స్థాపించబోతున్న ఈ కాకతీయ టెక్స్ టైల్ పార్క్లో పరిశ్రమలు స్థాపించేందుకు ఒప్పించారు.
వరంగల్ లో ఈ పార్క్ ఏర్పాటైతే, చాలా బారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా రాష్ట్రంలో చేనేత మరియు పవర్ లూమ్ కార్మికులకు, అలాగే రాష్ట్రం నుంచి గుజరాత్ లోని సూరత్ కు వలసపోయిన కార్మికులకు దీనిలో బారీగా ఉద్యోగాలు లభిస్తాయి.
రాష్ట్రంలో పత్తిరైతులకు కూడా గిట్టుబాటు ధర లభిస్తుంది. వారు పండించే పత్తికి డిమాండ్ ఏర్పడుతుంది కనుక దానిని అమ్ముకోవడానికి దళారులను ఆశ్రయించి మోసపోనవసరం ఉండదు. టెక్స్ టైల్ పార్క్ పూర్తి స్థాయిలో ఉత్పత్తి మొదలుపెడితే పన్నుల రూపంలో ప్రభుత్వానికి, విద్యుత్, రవాణా, నీటి సరఫరా ఇతర సౌకర్యాల కల్పించినందుకు ఆయా శాఖలకు కూడా మంచి ఆదాయం లభిస్తుంది. ముఖ్యంగా చుట్టుపక్కల జిల్లాలలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. కనుక ఈ కాకతీయ టెక్స్ టైల్ పార్క్ ఎంత త్వరగా ఏర్పడితే అంత మంచిది.