కేసీఆర్ తో పయ్యావుల మంతనాలపై బాబు ఆగ్రహం

October 11, 2017


img

ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్న ఆదివారం ఏపి మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరాం వివాహానికి హాజరయ్యి వధూవరులను ఆశీర్వదించి, తిరిగి వస్తున్నప్పుడు అక్కడే ఉన్న తెదేపా సీనియర్ నేత పయ్యావుల కేశవ్ తో కాసేపు ఏకాంతంగా మాట్లాడటంతో దానిపై మీడియాలో రకరకాల ఊహాగానాలు వచ్చాయి. 

“తెలంగాణాలో తెరాసతో తెదేపా, భాజపాలు పొత్తులు పెట్టుకొంటే అందరికీ మేలు కలుగుతుందని” మోత్కుపల్లి చెప్పిన కొన్నిరోజులకే ఇది జరుగడంతో ఆ దిశలో రెండు పార్టీలు పావులు కదుపుతున్నాయని మీడియాలో ఒకవర్గం ఊహాగానాలు చేసింది. 

‘అదేమీకాదు.. తెలంగాణాలో రెడ్డి సామాజికవర్గం కాంగ్రెస్ పార్టీవైపే మొగ్గు చూపుతుండటంతో, రాష్ట్రంలో బలమైన కమ్మ సామాజిక వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నంలోనే కేసీఆర్ ఈ వివాహానికి హాజరయ్యి, పరిటాల రవి ఘాట్ వద్దకు వెళ్ళి ఆయనకు నివాళులు అర్పించారని, అదే సామాజిక వర్గానికి చెందిన పయ్యావుల కేశవ్ తో తెలంగాణాలో కమ్మ సామాజికవర్గం గురించి ఆరా తీశారని మరో కధ వినిబడింది.’

సరిగ్గా ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూసే సాక్షి మీడియా, తెలంగాణాలో తెదేపాను కాపాడుకోవడం కోసం చంద్రబాబు నాయుడే ఈ సరికొత్త డ్రామాకు తెరతీశారని, కానీ తెరాసకు దూరంగా ఉండాలని తెదేపా నేతలను హెచ్చరించినట్లు మీడియాకు లీకులు ఇస్తున్నారని వ్రాసిపడేసింది. ఈ ఊహాగానాలలో నిజానిజాలు ఏమిటో వారిరువురికే తెలియాలి.

అయితే తెలంగాణాలో తెరాస చాలా బలంగా ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసీఆర్ తెదేపాతో పొత్తుల గురించి తెదేపా నేత పయ్యావుల కేశవ్ తో మాట్లాడారని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆ అవసరం తెదేపాకే ఉంది తప్ప తెరాసకు లేదని అందరికీ తెలుసు. అయితే ఆయన పయ్యావులతో ఏమి మాట్లాడారనే విషయం నేటికీ బయటకు రాలేదు కనుక దానిపై చాలా ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. 

వాటిపై ఏపి ఏపి సిఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, “అక్కడ తెలంగాణాలో మన పార్టీ తెరాస సర్కార్ తో పోరాడుతున్నప్పుడు, ఇక్కడ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తి కేసీఆర్ తో మంతనాలు చేయడంతో తప్పుడు సంకేతాలు పంపినట్లయింది. దీనిపై తెలంగాణా తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నేతలతో ముచ్చట్లు, పొత్తుల ప్రస్తావనలు ఎవరూ చేయవద్దు,” అని పార్టీ నేతలను హెచ్చరించారు. కేసీఆర్ పయ్యావులతో ఏమి మాట్లాడారో తెలియదు కానీ అది ‘బియ్యం గింజల్లో వడ్ల గింజ’ సామెతను గుర్తు చేస్తోంది. 


Related Post