దేశంలో వైశ్యులు ప్రజలను దోచుకొనే సామాజిక స్మగ్లర్లు అని చెపుతూ ప్రముఖ రచయిత కంచ ఐలయ్య వ్రాసిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అనే పుస్తకం చాలా వివాదాస్పదమయిన సంగతి తెలిసిందే. కంచ ఐలయ్యవంటి మేధావి ఒక వర్గం ప్రజలను కించపరిచేవిధంగా, వారి మనోభావాలు దెబ్బ తినేవిధంగా పుస్తకం వ్రాయడాన్ని అన్ని రాజకీయ పార్టీలు, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, సమాజంలో వివిధ వర్గాల ప్రజలు తప్పు పడుతున్నప్పటికీ అయన ఏమాత్రం వెనక్కు తగ్గకుండా తను వ్రాసిన ప్రతీ అక్షరానికి కట్టుబడి ఉన్నానని గట్టిగా చెపుతుండటంతో వైశ్య ప్రజలకు పుండు మీద కారం చల్లినట్లవుతోంది. వారు తన భావ ప్రకటన స్వేచ్చకు భంగం కలిగిస్తున్నారని, తనకు వారి వలన ప్రాణహాని ఉందని ఐలయ్య వాదిస్తున్నారు. తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.
ఆయనతో ఈవిధంగా వాగ్వాదాలు చేయడం కంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించడమే మేలని భావించిన ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు కొందరు ఆయనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ మల్కాజ్ గిరి కోర్టులో పిటిషన్ వేశారు. దానిపై స్పందించిన న్యాయస్థానం ఐలయ్యపై అట్రాసిటీ కేసు నమోదు చేయవలసిందిగా మల్కాజ్ గిరీ పోలీసులను ఈరోజు ఆదేశించింది.
దేశంలో ప్రతీ వ్యక్తికి భావప్రకటన స్వేచ్చ ఉన్నమాట నిజమే కానీ అది ఇతరుల ప్రాధమిక హక్కులకు భంగం కలిగించనంత వరకేనని బహుశః ఐలయ్యకు కూడా తెలిసే ఉండవచ్చు. సమాజంలో ఒక వర్గం ప్రజల ఆహారపు అలవాట్లు, ఆచార వ్యవహారాలు, ఆలోచన తీరు ఒకే విధంగా ఉండటం సహజమే. కానీ అంతమాత్రన్న ఆ వర్గం ప్రజలందరూ మంచివారో లేదా చెడ్డవారో అని నిర్దారించడం అవివేకమే. ఐలయ్య పిడివాదన ఎలా ఉందంటే ముస్లింలు అందరూ ఉగ్రవాదులేననే ట్రంప్ వాదనలా ఉంది. అందుకే తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అని వితండవాదన చేస్తూ ఇద్దరూ అందరి ఆగ్రహానికి గురవుతున్నారు.
వైశ్యప్రజలను అవమానిస్తూ పుస్తకం వ్రాసినందుకు ఒకవేళ న్యాయస్థానం ఐలయ్యకు శిక్ష విధిస్తే అది ఆయనకే అవమానం అవుతుంది. పైగా దాని వలన కూడా సమాజంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. కనుక ఇప్పటికైనా ఆయన తన పుస్తకాన్ని వెనక్కు తీసుకొని వైశ్యులను క్షమాపణ కోరి ఈ వివాదానికి ఇక్కడితో ముగింపు పలికితే అందరికీ మంచిది.