ఏపికి ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు కుప్పిగంతులు వేస్తూ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడంతో వారు దానిపై ఆశలు వదిలేసుకొని చాలా కాలమే అయ్యింది. అయితే వచ్చే ఎన్నికలలో దానిని తెదేపాపై బ్రహ్మాస్త్రంలాగ ప్రయోగించాలనే ఉద్దేశ్యంతో ప్రజలు దానిని మరిచిపోకుండా జాగ్రత్తపడుతూ జగన్మోహన్ రెడ్డి తనకు ఓపికున్నప్పుడు లేదా తెదేపా సర్కార్ పై పోరాడేందుకు మరే అంశం కనబడనప్పుడు ఈ ప్రత్యేకహోదాని బయటకు తీసి భేరీలు మ్రోగిస్తుంటారు.
ఈరోజు అనంతపురంలో దానికోసం యువభేరీ మ్రోగించారు. ఆ సందర్భంగా ఒక కీలకమైన ప్రకటన చేశారు. తాను నవంబర్ 2 నుంచి ఆరు నెలలపాటు రాష్ట్ర వ్యాప్తంగా 3,000 కిమీ పాదయాత్ర మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించారు. ఇడుపులపాయ నుంచి చిత్తూరు మీదుగా శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురంలో అది ముగుస్తుందని జగన్ రోడ్డు మ్యాప్ ప్రకటించారు.
ప్రత్యేక హోదా గురించి మద్యలో ఇన్నాళ్ళు ఎందుకు పోరాదలేదనే ప్రశ్నకు రాష్ట్రంలో పిల్లలకు పరీక్షలు జరుగుతున్న కారణంగా వాటికి అవరోధాలు ఏర్పడకూడదనే ఉద్దేశ్యంతో ప్రత్యేక పోరాటాలు చేయలేదని జగన్ సమాధానం చెప్పడం విడ్డూరంగా ఉంది. ఏడాదికో ఆరు నెలలకో ఓసారి ప్రత్యేక హోదా అని నిద్రలో పలవరించినట్లు పలవరిస్తూ ‘జగన్ మాట్లాడితేనే అందరికీ ప్రత్యేక హోదా గుర్తుకు వస్తుందని’ చెప్పుకోవడం విచిత్రంగా ఉంది. ఆయన దానిని తన రాజకీయ ప్రయోజనం కోసమే ఇంకా బ్రతికించి ఉంచుకొంటున్నారు తప్ప నిజంగా దానిని సాధించాలనే తపనతో కాదని అందరికీ తెలుసు. అందుకే రాష్ట్ర ప్రజలు కూడా అయన పోరాటాలను నమ్మడం లేదు.
అయినా భాజపాకు దగ్గరవ్వాలని కలలుకంటూ మళ్ళీ దానికి రాష్ట్రంలో రాజకీయంగా నష్టం కలిగించే ఈ అంశంపై పోరాడితే ఎవరికి నష్టం? అని జగన్ ఆలోచించడం లేదు. ఏమైనప్పటికీ 3,000 కిమీ పాదయాత్ర చేస్తే ఎన్నికలలో తప్పకుండా గెలిచేసి అధికారంలోకి వచ్చేయవచ్చనే భ్రమలో ఉన్నారు కనుక ఒకవేళ నిజంగా అధికారంలోకి వస్తే అప్పుడు కూడా జగన్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతారో లేదో చూడాలి. నిజానికి ఈ ప్రత్యేకహోదా అంశం ఏపిలో అధికార, ప్రతిపక్షాలకు ఒక ఫుట్-బాల్ మాదిరిగా మారిపోయింది. దానితో ఎవరు గోల్ చేస్తారో..ఎవరు గోల్ అవుతారో చూడాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.