సింగరేణి ఎన్నికలలో ఘన విజయం సాధించిన ఊపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో రాష్ట్రంలో వరుసగా 6 బహిరంగసభలు నిర్వహించబోతున్నారు. మొట్టమొదటగా రాజన్న సిరిసిల్లా జిల్లాలో సిరిసిల్ల, సిద్ధిపేట, నిర్మల్ పట్టణాలలో అక్టోబర్ 11న వరుసగా మూడు బహిరంగసభలు నిర్వహించబోతున్నారు. ఆ తరువాత అక్టోబర్ 12న సూర్యాపేటలో,ఆ మరునాడు అంటే అక్టోబర్ 13న నారాయణ్ ఖేడ్ లో వరుసగా బహిరంగసభలు నిర్వహించబోతున్నారు. మళ్ళీ అక్టోబర్ 20న వరంగల్ లో ఒక బహిరంగసభ నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలలో ఇతర అధికారిక కార్యక్రమాలకు సిఎంఓ. అధికారులు జిల్లా అధికారులతో మాట్లాడి తుదిరూపునిస్తున్నారు.
ఈ వరుస సభల ఉద్దేశ్యం అందరూ తేలికగానే ఊహించవచ్చు. తెలంగాణా రాష్ట్రాభివృద్ధికి తమ ప్రభుత్వం చేస్తున్న కృషి, రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజల కోసం అమలుచేస్తున్న వివిద సంక్షేమ కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రజలకు మరొకసారి వివరించి, వాటికి ప్రతిపక్షాలు ఏవిధంగా అడ్డంకులు సృష్టిస్తున్నాయో వివరించవచ్చు. తమ ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాల కారణంగానే సింగరేణి కార్మికులు తమను ఆశీర్వదించారని కేసీఆర్ చెప్పవచ్చు.
సాధారణ రాజకీయనేత అయితే ఎన్నికలలో గెలవగానే విజయోత్సవం పేరిట బాజాబజంత్రీలతో తన అనుచరులను వెంటేసుకొని టపాసులు కాల్చుతూ వాహనమపి ఊరేగుతాడు. కానీ రాజకీయ చతురత కలిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా దూరదృష్టితో ఈ సభలు నిర్వహిస్తున్నారు. తమ ఈ విజయాన్ని ఇతర జిల్లాల ప్రజలతో పంచుకోవడం ద్వారా వారు కూడా తాము దానిలో భాగస్వాములని భావించేలా చేయాలనుకోవడం చాలా తెలివైన ఎత్తుగడేనని చెప్పవచ్చు.