ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రామ్ గోపాల్ వర్మ తీయబోతున్న సినిమాకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే పేరు పెట్టడంతోనే, దానిలో ఆయన ఏమి చూపించబోతున్నారో అర్ధం అయ్యింది. తెలుగుదేశం పార్టీని బద్ధశత్రువుగా భావిస్తున్న వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ కు చెందిన రాకేశ్ రెడ్డిని ఆ సినిమాకు నిర్మాతగా ఎంచుకోవడంతో ఆయన వెనుక, ఆ సినిమా వెనుక వైకాపా ఉన్నట్లు స్పష్టం అయ్యింది. కానీ ఆ సినిమాతో తమ పార్టీకి ఎటువంటి సంబందమూ లేదని వైకాపా ఎమ్మెల్యే రోజా చెప్పారు.
వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలలో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్న ఈ సమయంలో సరిగ్గా వాటికి ఒక నెల ముందుగా తన సినిమాను రిలీజ్ చేస్తానని వర్మ ప్రకటించడంతో ఈ సినిమాను రాజకీయ కారణాలతోనే, రాజకీయ నాయకుల ప్రోత్సాహంతోనే వర్మ తీస్తున్నట్లు స్పష్టం అవుతోంది.
ఆ సినిమాను లక్ష్మీ పార్వతి కోణంలో నుంచి చూపించబోతున్నందున, దానిలో విలన్ చంద్రబాబు నాయుడేనని వేరే చెప్పనవసరం లేదు. కానీ దానిలో చంద్రబాబు నాయుడిని విలన్ గా చూపిస్తానో లేదో ఇప్పుడే తానేమీ చెప్పలేనని రామ్ గోపాల్ వర్మ అన్నారు. అయితే ఆ సినిమాకు ఆయన ఎంచుకొన్న పేరు, దాని నిర్మాత, ఆ సినిమా రిలీజ్ కు ఆయన ఎంచుకొన్న ముహూర్తం అన్నీ కూడా వచ్చే ఎన్నికలలో తెదేపాను, దాని అధినేత చంద్రబాబు నాయుడును దెబ్బ తీయడానికేనని స్పష్టంగా కనబడుతూనే ఉంది.
సినిమాలలో హీరోలు రాజకీయ విలన్స్ ను మట్టుబెట్టి ప్రజలను, చట్టాన్ని, ధర్మాన్ని కాపాడేయడం మనం చూస్తూనే ఉన్నాము. కానీ నిజజీవితంలోని రాజకీయ నేతలను, వారి పార్టీలను దెబ్బ తీయడానికి సినిమాలను ఆయుధంగా చేసుకొనే సరికొత్త ట్రెండ్ ను రామ్ గోపాల్ వర్మ సృష్టిస్తున్నాడని చెప్పకతప్పదు.
ఇప్పటికే ఈ విష సంస్కృతి మీడియాకు వ్యాపించడంతో, ఒక్కో మీడియా ఒక్కో రాజకీయ పార్టీకి వత్తాసు పలుకుతూ, వాటి ప్రత్యర్ధులను దెబ్బ తీసేవిధంగా వార్తలు, కధనాలు, విశ్లేషణలు వండి వడ్డిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ విష సంస్కృతి సినీరంగానికి కూడా రామ్ గోపాల్ వర్మ వంటివారు వ్యాపింపజేస్తున్నారు.
రాజకీయ పార్టీలను, వాటి నేతలను ప్రమోట్ చేసుకోవడానికి ఎవరు ఎన్ని సినిమాలు తీసుకొన్నా పరువాలేదు కానీ ఈవిధంగా ఒక పార్టీని, దాని నేతలను రాజకీయంగా దెబ్బ తీయలనుకొంటే దాని పరిణామాలు ఏవిధంగా ఉంటాయో..ఎంత తీవ్రంగా ఉంటాయో ఎవరూ ఊహించలేరు.
రామ్ గోపాల్ వర్మ తీస్తున్న ఈ సినిమా వచ్చే ఎన్నికల నాటికి రిలీజ్ అయినా కాకపోయినా, హిట్ అయినా కాకపోయినా, వచ్చే ఎన్నికల వరకు ఆ సినిమా గురించి ఆయన సోషల్ మీడియాలో పెట్టే మెసేజులు, మీడియాకు ఇచ్చే ఇంటర్వ్యూలు, మళ్ళీ వాటిపై మీడియాలో వచ్చే వార్తలు, కధనాల వలన తెలుగుదేశం పార్టీకి, దాని ప్రభుత్వానికి ఎంతో కొంత నష్టం జరిగే ప్రమాదం కూడా ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. ఇంతకీ చంద్రబాబు నాయుడుపై రామ్ గోపాల్ వర్మకు ఎందుకు కోపం వచ్చిందో?