ఇటీవల డయల్ యువర్ విలేజ్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణా సాంస్కృతిక శాఖకు డైరెక్టర్ శ్రీ మామిడి హరికృష్ణగారి ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్రంలో సంస్కృతీ సంప్రదాయాల, సాహిత్యం, కళలు పునరుజ్జీవనం కోసం ఆయన చేస్తున్న కృషి గురించి ఇదివరకు చెప్పుకొన్నాము. ఈసారి ఆయన కృషి కారణంగా రాష్ట్రంలో వచ్చిన అనేక మార్పుల గురించి తెలుసుకొందాము.
మన సంస్కృతి, సంప్రదాయాలు, మన పండుగలు, మన సాహిత్యం, మన కళలు, మన కట్టుబట్ట, మన యాస..మన బాష...ఇలాగ ప్రతీ ఒక్కటీ గుర్తించి, వాటికి పునరుజ్జీవనం, ప్రచారం కల్పించి, వాటి ప్రాముఖ్యతను పెంచి అందరూ గుర్తించి ఆధారించేలా చేయడమే లక్ష్యాలుగా పెట్టుకొని హరికృష్ణగారు నిరంతరం పనిచేస్తున్నారు.
అది సాహిత్యమైనా..ఒగ్గు కధయినా..జానపద కవిత్వమైనా..నాటకాలయినా..పేరిణీ నృత్యమైనా...సూఫీ సంగీతమైనా, కవ్వాలీ..ముషైరా..గజల్స్..పద్యనాటకాలు...సాంఘిక నాటకాలు..సినిమాలు..ఇలాగ ఏవైనాసరే తెలంగాణాకు సంబదించినవైతే చాలు...హరికృష్ణగారు వాటి మూలాలను, ఆయా రంగాలలో నిష్ణాతులైన వారిని వెతికి పట్టుకొని చేరదీసి..ప్రోత్సహించి..వారిచే యువతరానికి శిక్షణ శిబిరాలు, ఏర్పాటు చేయిస్తున్నారు. అలాగా శిక్షణ పొందిన వారిచేత వివిధ ప్రభుత్వ కార్యక్రమాలలో, వివిధ జిల్లాలలో, రాష్ట్రాలలో..సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహింపజేస్తున్నారు. తద్వారా వాటికి పునరుజ్జీవనం కల్పిస్తూ, మన సంస్కృతీ సాంప్రదాయాల గొప్పదనాన్ని మన ప్రజలు..మనతోబాటు యావత్ దేశవిదేశాల ప్రజలు గుర్తించి ఆదరించేలా చేస్తున్నారు. శిధిలావస్థకు చేరుకొన్న ఆలయాల వంటి మన కళారూపాలను బ్రతికించుకోవడం కోసం ఆయన చేస్తున్న కృషి అపూర్వం. అనన్య సామాన్యం.
రాష్ట్రంలో గ్రామగ్రామాన్న ఉన్న అటువంటి కవులు, కళాకారులు, సాహిత్యకారుల పూర్తి వివరాలు సేకరించి, వారి డేటా బేస్ తయారుచేస్తున్నారు. దాని కోసం ఒక వెబ్ సైట్ ను కూడా రూపొందించారు. కళలను బ్రతికించుకోవడానికి హరికృష్ణగారు పడుతున్న తపనను చూసి దానిలో అనేకమంది కళాకారులు తమ వివరాలను నమోదు చేసుకొన్నారు. దాని ద్వారా సాంస్కృతిక శాఖ కూడా వారితో అనుసంధానమై కార్యక్రమాలు రూపొందించుకొంటూ ముందుకు సాగుతోంది.
హైదరాబాద్ లో కొన్ని ఆలయాలకే పరిమితమైన బోనాలు పండుగ క్రమంగా 126 ఆలయాలకు విస్తరించింది. అందుకు కారణం ఏమిటంటే, బోనాల పండుగలో తెలంగాణా సంస్కృతీ సాంప్రదాయాలు ఉట్టిపడే కళారూపాల ప్రదర్శనలు ఏర్పాటు చేస్తుండటంతో అవి చూసి ఆకర్షితులవుతున్న ప్రజలు తమ ప్రాంతాలలో గల ఆలయాలలో కూడా బోనాలు పండుగ నిర్వహించమని కోరుతుండటమే. ఇది తెర వెనుక హరికృష్ణగారు చేస్తున్న కృషి వల్లే సాధ్యం అయ్యింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించినప్పతి నుంచి నానాటికీ అది ఊరూవాడా ఎంత ఘనంగా నిర్వహించబడుతోందో..దానిలో ఎన్ని కళారూపాలు ప్రదర్శింపబడుతున్నాయో...దాని గురించి దేశవిదేశాలలో ఎంతగా ప్రచారం జరుగుతోందో..వాటి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో ప్రజలందరూ చూస్తున్నారు.
ఆయన కృషి, పట్టుదల కారణంగా ఇప్పుడు గణేష్ ఉత్సవాలలో, పంద్రాగస్టు వేడుకలలో, గణతంత్ర వేడుకలలో..సందర్భం ఏదైనప్పటికీ..తెలంగాణా సంస్కృతీ సాంప్రదాయాలు ఉట్టిపడే వివిధ కళారూపాల ప్రదర్శనలు రాష్ట్రమంతటా కనబడుతున్నాయి. వాటిని ప్రజలు కూడా గమనించే ఉంటారు.
ఈ మూడేళ్ళలో ఒగ్గుకధ, ఒగ్గు డోలు, కిన్నెర పాటలు, రుంజ, చిందు యక్షగానం, జడ కొప్పుల వంటి జానపద కళాకారులను గుర్తించి వాటి గురించి వారు తెలియజేస్తున్న వివరాలను డాక్యుమెంటేషన్ చేస్తున్నారు.
అలాగే మరుగునపడిన మన పేరిణి నృత్యానికి గుర్తింపు కల్పించేందుకు 12మంది నృత్య కళాకారులను వెతికి పట్టుకొని (వారందరూ 55-60 ఏళ్ళు పైబడిన కళాకారులే) వారిచేత యువతీ యువకులకు శిక్షణ ఇప్పిస్తున్నారు. పేరిణీ నృత్యానికి ప్రభుత్వం చేత గుర్తింపు కల్పించి, దానికి ఒక సిలబస్ తయారుచేయించి, దానిని రాష్ట్రంలో ఉన్న ఆరు సంగీత కళాశాలలలో దానిని సర్టిఫికేట్ కోర్సు గా కోర్సుగా ప్రవేశపెట్టగలిగారు. ఆ కారణంగా ఇప్పటికి రాష్ట్రంలో 1,000 మందికి పైగా పేరిణీ నృత్యకళాకారులు తయారయ్యారు. త్వరలో హైదరాబాద్ లో జరుగబోయే ప్రపంచ తెలుగు మహాసభలలో వారిచేత నృత్య ప్రదర్శన చేయించనున్నారు.
ఒకప్పుడు ఏటా ఉగాది పండుగన ఏదో మొక్కుబడిగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకోవడం, మొక్కుబడిగా అవార్డులు ఇవ్వడం జరుగుతుండేది. కానీ ఇప్పుడు ఏటా మండల స్థాయి నుంచి జిల్లా..రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వం అవార్డులు అందజేస్తోంది. ఇక మహిళా దినోత్సవం వంటి సందర్భాలను కూడా హరికృష్ణగారు వదిలిపెట్టలేదు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంకూ బాయ్ వంటి సామాన్యులలో అసమాన్యులనదగ్గ మహిళలను గుర్తించి వారికి అవార్డులు, ప్రభుత్వం తరపున వారికి అన్నివిధాల సహాయ సహకారాలు అందించడం మొదలుపెట్టారు. ఈవిధంగా తెర వెనుక హరికృష్ణగారు చేస్తున్న కృషి గురించి..వాటి వలన మన సంగీత, సాహిత్య, కళారూపాల పునరుజ్జీవనం గురించి ఎంత చెప్పుకొన్నా సరిపోదు. కానీ స్థలాభావం చేత ఇక్కడితో ముగించవలసి వస్తోంది. మళ్ళీసారి మన సాహిత్యం, మన సినిమాల కోసం ఆయనేమి చేశారో చెప్పుకొందాం. సశేషం.
మైతెలంగాణా అక్టోబర్ 5 సంచికలో ప్రచురితమైన మామిడి హరికృష్ణగారి ఇంటర్వ్యూ మొదటి భాగం చదవాలనుకొంటే ఈ లింక్ పై ప్రెస్ చేయండి:
http://www.mytelangana.com/telugu/editorial/8962/mamidi-harikrishna-interview
మామిడి హరికృష్ణగారి పూర్తి సంభాషణ వినాలనుకొంటే ఈ క్రింది లింకులో వినవచ్చు.
https://fccdl.in/X0dA8WMrY
మీరు కూడా ఈ చర్చల్లో పాల్గొనాలనుకుంటే, ఈ క్రింది whatsapp గ్రూప్ ఆహ్వానం క్లిక్ చేసి, గ్రూప్ లో జాయిన్ అవండి.
https://chat.whatsapp.com/GchpC6r5qyF1sZOKWVRMng
"డయల్ యువర్ విల్లేజ్" ఫేస్ బుక్ లింక్: https://www.facebook.com/groups/821757117915265/