తెదేపాలో నో కన్ఫ్యూజ్: రమణ

October 09, 2017


img

ఒకప్పుడు తెలంగాణాలో ఎంతో బలంగా ఉన్న తెదేపా ఫిరాయింపుల కారణంగా దాదాపు నిర్వీర్యం అయిపోయింది. పైగా రాష్ట్రంలో అంతో ఇంతో బలం ఉన్న భాజపా కూడా దానికి దూరమైపోవడంతో ఇంకా బలహీనపడింది. ఇక ఓటుకు నోటు పుణ్యమో మరొకటో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు తెలంగాణావైపు కన్నెత్తి చూడటం మానేశారు. దానితో తెదేపా ఎడారిలో ఒంటరి బాటసారిలాగ మిగిలిపోయింది. అయితే నేటికీ తన ఉనికిని కాపాడుకొంటూనే ఉంది. గట్టిగా నిలబడే ఉంది. కానీ పార్టీలో హేమాహేమీలున్నప్పటికీ అందరూ ‘సైలెంట్ మోడ్’ లో ఉండిపోవడం వలన పార్టీలో రేవంత్ రెడ్డి గొంతు ఒక్కటే బిగ్గరగా వినిపిస్తోంది. ఆయన బొమ్మే కనిపిస్తోంది. కనుక పార్టీ నిలబెట్టిన క్రెడిట్ ఆయనకే దక్కుతుందని చెప్పకతప్పదు. అయితే అదిప్పుడు అప్రస్తుత విషయం. 

తెరాస సర్కార్ ను తెదేపా (రేవంత్ రెడ్డి) గట్టిగా ఎదిరించిపోరాడుతున్న సమయంలో మోత్కుపల్లి నరసింహులు ఒక కొత్త చర్చకు తెరలేపారు. వచ్చే ఎన్నికలలో తెరాసతో సహా ఏ పార్టీ కూడా తనంతటతానుగా అధికారంలోకి రాలేదని కనుక తెరాస, తెదేపా, భాజపాలు చేతులు కలిపితే మూడు పార్టీలకు మేలుకలుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై మీడియాలో రకరకాల వార్తలు, ఊహాగానాలు వస్తున్నాయి. వాటన్నిటికీ తెర దించారు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ. 

ఆయనతో సహా రాష్ట్ర తెదేపా ముఖ్యనేతలు ఆదివారం తమ అధినేత చంద్రబాబుతో సమావేశం అయ్యి రాష్ట్రంలో తెదేపా పరిస్థితి గురించి లోతుగా చర్చించిన తరువాత రమణ ఈ ప్రకటన చేశారు. 

“మేము తెరాసతో పొత్తులు పెట్టుకోబోతున్నామనే వార్తలను ఖండిస్తున్నాం. 2019 ఎన్నికలలో మేము ఒంటరిగానే పోటీ చేస్తాం. ఒకవేళ మాతో భాజపా కలిసివస్తే సంతోషమే. వారు మాకు దూరంకావడానికి బలమైన కారణాలు ఏవీ కనబడటం లేదు. ఒకవేళ రాకపోతే మేము ఒంటరిపోరుకు సిద్దం. ఆలోగా మేము మా పార్టీని గ్రామస్థాయి నుంచి మళ్ళీ బలోపేతం చేసుకొంటాము,” అని అన్నారు. 

ఇటీవల జరిగిన సింగరేణి ఎన్నికలతో సహా అనేక సందర్భాలలో రాష్ట్ర తెదేపా నేతలు తమ బద్ధవిరోధులైన కాంగ్రెస్ నేతలతో కలిసి పనిచేశారు. వీలైతే వచ్చే ఎన్నికలలో కలిసి పనిచేస్తామని రెండు పార్టీల సీనియర్ నేతలు స్పష్టమైన సంకేతాలు పంపుకొన్నారు కూడా. కానీ తెదేపా నేతలు చంద్రబాబుతో సమావేశం అయిన తరువాత ‘కాంగ్రెస్ వద్దు...భాజపాయే ముద్దు’ అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి ఏమంటారో చూడాలి. 


Related Post