సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలు అధికార తెరాసకు విపక్షాలకు తమ బలాబలాలు ప్రదర్శించడానికి, తేల్చుకోవడానికి ఒక మంచి యుద్దవేదికగా పనికివచ్చాయని చెప్పవచ్చు. ఈ ఎన్నికల ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని విషయాలు చెప్పకనే చాటి చెప్పారు. వచ్చే ఎన్నికలలో ప్రతిపక్షాలన్నీ చేతులు కలిపి తెరాసను ఓడించాలని చేస్తున్న ఆలోచనలు ఫలించవని ఈ ఎన్నికల ద్వారా నిరూపించి చూపారు. అలాగే ప్రతిపక్షాలకు తెరాసను డ్డీకొనే శక్తిసామర్ధ్యాలు, ఓడించే సత్తా రెండూ లేవని నిరూపించి చూపారు.
ప్రతిపక్షాల మద్య ఐఖ్యత లేదనే విషయాన్ని కూడా ఈ ఎన్నికలలో చాటి చూపారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్, తెదేపా, వామపక్షాలు ఏఐటియుసికి మద్దతు ఇస్తే భాజపా తమ అనుబంధ కార్మిక సంఘం బిఎంఎస్ కు మద్దతు ఇచ్చింది. తద్వారా భవిష్యత్ లో ఆ రెండు పార్టీలతో చేతులు కలపబోమని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. అంతేకాదు...రాష్ట్ర భాజపా నేతలు చెప్పుకొంటున్నట్లు తెరాసను ఓడించే శక్తి వారికి లేదని ఈ ఎన్నికల ద్వారా మరోసారి నిరూపితమయ్యింది.
సింగరేణి ఎన్నికలలో బిఎంఎస్ చాలా ఘోరంగా ఓడిపోవడం వలన దానికేమీ కాదు కానీ రాష్ట్ర భాజపా అభాసుపాలైందని చెప్పక తప్పదు. ఒక కార్మిక సంఘాల ఎన్నికలలోనే గెలవలేని పార్టీ, ఇక సార్వత్రిక ఎన్నికలలో ఏవిధంగా గెలవగలదు? అనే ఆలోచన ప్రజలకు కలిగితే ఆశ్చర్యం లేదు
వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే గెలిచి అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ నేతలందరూ బల్లగుద్ది వాదిస్తున్నప్పుడు, అదే నిరూపించుకొనేందుకు ఈ ఎన్నికలలో ఎటువంటి కృషి చేయలేదు. అనేకమంది సీనియర్ కాంగ్రెస్ నేతలు అసలు సింగరేణి వైపు చూడలేదు..ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. తద్వారా కాంగ్రెస్ పార్టీలో అనైక్యతను వారు మరోమారు బయటపెట్టుకొన్నారు.
ఈ ఎన్నికలతో తెరాస సర్కార్ పతనం ప్రారంభం అవుతుందని ప్రతిపక్షాలు గట్టిగా వాదించాయి కానీ టిబిజికెఎస్ ఘనవిజయం సాధించడంతో ప్రతిపక్షాల బలహీనత మరింత కొట్టవచ్చినట్లు అందరికీ కనబడింది. ఎన్నికలలో గెలుపోటములు సహజమేనని ప్రతిపక్షాలు ఎంతగా సమర్ధించుకొన్నప్పటికీ, ఈ ఓటమి వాటి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసిందని చెప్పవచ్చు. కనుక సింగరేణి ఎన్నికలు ఎవరి సత్తా ఏపాటిదో ప్రజలకే కాకుండా ఆయా పార్టీలకు కూడా అర్ధమయ్యేలా చేశాయని చెప్పవచ్చు.