మంత్రి తలసానికి ఆ హక్కు ఉందా?

October 09, 2017


img

ఇటీవల రాజకీయాలలో తరచుగా వినబడుతున్న పదం ‘నైతికహక్కు.’  దానిని మన రాజకీయ నాయకులు  అలవోకగా వాడేస్తుంటారు. అయితే ఇప్పుడు నిజంగానే ఆ నైతికహక్కు గురించి మాట్లాడుకోవలసిన అవసరం వచ్చింది. 

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏనాడూ తెలంగాణా ఉద్యమాలలో పాల్గొనలేదనే అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో తెరాస సర్కార్ అధికారంలో వచ్చిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించడంతో తెరాసలో చేరి మంత్రయ్యారు కానీ నేటికీ తెదేపా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అటువంటి ఆయన తెలంగాణా ఉద్యమాలను ముందుండి నడిపించిన టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ పై విమర్శించడం విస్మయం కలిగిస్తుంది.

ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రొఫెసర్ కోదండరామ్ పై మంత్రి తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ, “ఆయన మా ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకొని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. మా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయకుండా యువతను మోసం చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఆయనకు నిజాలు తెలుసుకోకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఈ మూడేళ్ళలో మా ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందో తెలుసుకోవాలనుకొంటే   ఆయన ఓసారి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ ను కలిసి అడిగితే పూర్తి వివరాలు అందిస్తారు. అది చూసిన తరువాత ఆయన మాట్లాడితే బాగుంటుంది. ఎప్పుడూ ఏదో వంక పెట్టి మా ప్రభుత్వాన్ని విమర్శించడం కాక, మా ప్రభుత్వం చేస్తున్న పనులలో ఏమేమి లోపాలు మీకు కనిపించాయో చెపితే తప్పకుండా సరిదిద్దుకొంటాము కదా?” అని అన్నారు. 

తెలంగాణా ఉద్యమాలలో ప్రధానపాత్ర పోషించిన కేసీఆర్, ప్రొఫెసర్ కోదండరామ్ గురించి మొన్న చులకనగా మాట్లాడినందుకే ప్రతిపక్షాలు ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పుడు, అసలు ఏనాడూ ఉద్యమంలో పాల్గొనని తలసాని ఉద్యమనేత అయిన ప్రొఫెసర్ కోదండరామ్ ను విమర్శించే నైతికహక్కు ఉందా? అని ప్రతిపక్షాలు ప్రశ్నించకమానవు.

మంత్రి తలసాని చెపుతున్నట్లుగానే ప్రభుత్వం చేపడుతున్న వివిధ పనులలో, దాని నిర్ణయాలలో తప్పులను ప్రొఫెసర్ కోదండరామ్ ఎత్తి చూపుతున్నారు. ఉదాహరణకు: "రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాలలో  ఇప్పటికే నీళ్ళు సరఫరా చేయడానికి పైపు లైనులు వేసి ఉన్నప్పుడు ప్రభుత్వం మళ్ళీ కొత్త పైపులు ఎందుకు వేస్తోంది? దాని వలన వందల కోట్లు ప్రజాధనం వృధా అవుతోంది,” అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆయన అడిగిన ఈ ప్రశ్నకు నేటికీ తెరాస మంత్రులు, నేతలు ఎవరూ సూటిగా జవాబు చెప్పలేదు. ఇక ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రొఫెసర్ కోదండరామ్ ఎవరిచేత లెక్కలు చెప్పించుకోనవసరం లేదు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆయనకు ఇటువంటి అన్ని విషయాలపై పూర్తి అవగాహన ఉంది కనుకనే ప్రభుత్వాన్ని  ప్రశ్నిస్తున్నారని చెప్పవచ్చు. దాని వెనుక రాజకీయకోణం ఉండి ఉంటే, ఆయన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పి ఆయన ముసుగును తొలగించవచ్చు కదా?

ఈ సందర్భంగా మంత్రి తలసాని ప్రతిపక్ష పార్టీలపై కూడా నిప్పులు చెరిగారు. వాటిలో కాంగ్రెస్, భాజపాలు తెలంగాణా ఉద్యమాలలో జోరుగా పాల్గొన్నవేనని అందరికీ తెలుసు. కానీ ఏనాడూ ఉద్యమాలలో పాల్గొనని మంత్రి తలసాని తెలంగాణా ఉద్యమనేత అయిన ప్రొఫెసర్ కోదండరామ్ ను విమర్శించవచ్చా?  నేటికీ తెదేపా ఎమ్మెల్యేగా కొనసాగుతూ తెరాస సర్కార్ లో మంత్రిగా చేస్తున్న ఆయన ప్రతిపక్షాలను విమర్శించే నైతిక హక్కు ఉందా? అనేదే ప్రశ్న. 


Related Post