ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా దూరదృష్టితో ఆలోచించి రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం రకరకాల పధకాలు అమలుచేస్తున్నారు. వాటి కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. వాటిలో సబ్సీడీ గొర్రెల పంపకం కూడా ఒకటి. రాష్ట్రంలో గొల్లకురుమలకు ఆదాయవనరు సృష్టించి వారిని ఆర్ధికంగా బలపరిచేందుకు ఒక్కో కుటుంబానికి 21 గొర్రెలు చొప్పున ఇప్పటి వరకు సుమారు 25 లక్షల గొర్రెలు పంపిణీ చేశారు. వాటికి ఆరోగ్య సమస్యలు వస్తే, నిరుపేదలైన లబ్దిదారులు వాటికి వైద్యం చేయించుకోలేరనే ఆలోచనతో సంచార పశువైద్యశాలలను ప్రారంభించారు.
కనుక ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయసహకారాలను సక్రమంగా ఉపయోగించుకోగలిగితే వారు తప్పకుండా ఆర్ధికంగా శక్తివంతులవుతారు. కానీ వారి అమాయకత్వాన్ని, వారి సమస్యలను, వారి అవసరాలను, బలహీనతలను కొందరు దళారులు సొమ్ము చేసుకొంటున్నారు. వారి చేతిలో ఎంతోకొంత డబ్బు పెట్టి సబ్సీడీ గొర్రెలను పట్టుకుపోతున్నారు.
మండలంలోని తాటికొండకు చెందిన యాదయ్య అనే వ్యక్తి మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలంలో హన్మసాన్ పల్లికి చెందిన యాదయ్య, సత్యనారాయణలకు ప్రభుత్వం అందించిన 42 గొర్రెలకు రూ.70,000 ముట్టజెప్పి లారీలో తరలించుకొనిపోతుండగా, జిల్లా పశువైద్యాధికారిణి స్వప్న పోలీసుల సహాయంతో పట్టుకొన్నారు. ఆమె వాటిని స్వాధీనం చేసుకొని గొర్రెలు అమ్మిన, కొన్నవారిపై పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు.
అందరూ ఆర్ధికంగా పుంజుకొని సుఖంగా జీవించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇన్ని విన్నూత్నమైన ఆలోచనలు చేస్తున్నా, ఇటువంటి కొందరు వ్యక్తులు ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయసహకారాలను దుర్వినియోగం చేస్తున్నారు. తద్వారా ప్రభుత్వం చేస్తున్న కృషి బూడిదలో పోసిన పన్నీరు అవుతోంది. కనుక ప్రభుత్వం పధకాలు విజయవంతం అయ్యేందుకుగాను దిగువ స్థాయి అధికారులు, ఉద్యోగులు కూడా ఇటువంటి సమస్యల పరిష్కారంలో కాస్త చొరవ తీసుకోవడం చాలా అవసరం.