ఉద్యోగాల భర్తీలో అన్ని ప్రాంతాలలో స్థానికులకు న్యాయం చేసేవిధంగా సమైక్య రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. అయితే అది దుర్వినియోగం అయ్యింది. అది వేరే విషయం. అప్పుడు సమైక్య రాష్ట్రాన్ని మొత్తం ఆరు జోన్లుగా విభజించారు. తెలంగాణా ఏర్పడిన తరువాత కూడా నేటికీ అదే పద్దతిలో మన రాష్ట్రంలో ఉన్న రెండు జోన్స్ కొనసాగుతున్నాయి. దానిని కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి, జిల్లాలకు అనుకూలంగా పునర్వ్యవస్తీకరించాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, అధికారులు, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ప్రకాశ్ రెడ్డి తదితరులతో శనివారం ప్రగతి భవన్ లో సమావేశమయ్యి దానిపై లోతుగా చర్చించారు. వారి సలహాలు, సూచనల మేరకు జోనల్ వ్యవస్థను కొనసాగించాలని నిర్ణయించారు. అయితే తెలంగాణా రాష్ట్రానికి అనుకూలంగా, సరిపడినన్ని కొత్త జోన్స్ ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
దీనిపై అన్ని కోణాలలో నుంచి లోతుగా అధ్యయనం చేసి, నివేదికను రూపొందించడానికి మంత్రులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దానిలో ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, మంత్రులు హరీష్ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఈటల రాజేందర్, చీఫ్ సెక్రెటరీ ఎస్పీ సింగ్, సీనియర్ అధికారులు ఎస్.కె. జోషి, సురేష్ చంద్ర, అజయ్ మిశ్రా, బి.ఆర్. మీనా, రాజీవ రంజన్ ఆచార్య, ఆధార్ సిన్హా, డిజిపి అనురాగ్ శర్మ సభ్యులుగా ఉంటారు. వారి నివేదిక ఆధారంగా తెలంగాణా రాష్ట్రంలో కోసం అదనపు జోన్లను ఏర్పాటు చేయడానికి రాష్ట్రపతి ఉత్తర్వులను కోరుదామని కేసీఆర్ చెప్పారు.