కేసీఆర్ ఒక్కరివల్లే తెలంగాణా రాలేదు: కోదండరామ్

October 07, 2017


img

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న తనను ఉద్దేశ్యించి చేసిన తీవ్ర విమర్శలు, ఆరోపణలకు టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ధీటుగా జవాబివ్వడమే కాకుండా ఎదురుదాడి చేశారు కూడా. 

“ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇతరుల గురించి అటువంటి బాషను, అటువంటి పదాలను ఉపయోగించడం సరికాదు. అవి ఆయన స్థాయికి తగ్గ మాటలు కావు. ఆయన మాటలు ఇతరులను రెచ్చగొట్టి హింసకు ప్రేరేపించేవిగా ఉన్నాయి. ఆయన నన్ను ఉదేశ్యించి ఆవిధంగా మాట్లాడటం ఆయన విజ్ఞతకే వదిలిపెడుతున్నాను. మేము లేవనెత్తుతున్న ఏ ఒక్క సమస్యకు కేసీఆర్ ఇంతవరకు నేరుగా సమాధానాలు చెప్పలేదు. ప్రశ్నిస్తున్న నావంటి వారిపై వ్యక్తిగత దూషణలు చేయడం ద్వారా ప్రశ్నించేవారి నోళ్ళు మూయించే ప్రయత్నం చేస్తున్నారు. ఎదురుదాడి చేస్తూ సమాధానాలు చెప్పకుండా తప్పించుకొంటున్నారు.

తెలంగాణా రాష్ట్రం ఆయన ఒక్కరి వల్లనే ఏర్పడలేదు. రాష్ట్రంలో ప్రజలు, రాజకీయ పార్టీలు, ఉద్యోగులు అందరూ కలిసికట్టుగా పోరాడిసాధించుకొన్నాము. తెలంగాణా ఉద్యమం 1952 నుంచే మొదలైందనే సంగతి అందరికీ తెలుసు. అది ముగిసేవరకు లక్షలాది మంది ప్రజలు దానిలో పాల్గొన్నారు. వేలాదిమంది యువకులు తెలంగాణా కోసం బలిదానాలు చేసుకొన్నారు. అటువంటి మహోద్యమాన్ని కేసీఆర్ తన వ్యక్తిగతం చేసుకొనే ప్రయత్నం చేయడం దానిని అవమానించినట్లే అవుతుంది..చరిత్రను వక్రీకరించడమే అవుతుంది.

తెలంగాణా సాధించింది..ఓ నలుగురికి అధికారం కట్టబెట్టడానికి కాదు. కానీ ఇప్పుడు అదే జరుగుతోంది. రాష్ట్రంలో అధికారమంతా ఓ నలుగురి చేతిలో చిక్కుకుపోయింది. మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణా ఈ మూడేళ్ళలోనే అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. తెలంగాణా వస్తే బడుగు,బలహీన, మైనార్టీ.. అన్ని వర్గాలకు న్యాయం చేసే సామాజిక తెలంగాణా రూపు దిద్దుకొంటుందని ఆశిస్తే, రాష్ట్రంలో నియంతపాలన సాగుతోంది. దీని కోసమేనా మనం ఇంతగా పోరాడింది? 

తెలంగాణా ప్రజలు ఏ ఆకాంక్షల కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించుకొన్నారో వాటిని సాకారం చేయాలని కోరుతున్నాము. కానీ ప్రభుత్వం తెలంగాణా ఆశయాలకు, ప్రజల ఆకాంక్షలకు, ఆశలకు పూర్తి భిన్నంగా నియంతపాలన సాగిస్తోంది కనుకనే దానిని సరిదిద్దుకోమని చెపుతున్నాము. మా పోరాటాలు ఎవరికీ వ్యతిరేకంగా చేస్తున్నవి కావు. మన ఆశయాలు, కలలు, ఆకాంక్షలకు దూరంగా వెళుతున్న ప్రభుత్వానికి దాని బాధ్యతలు గుర్తుచేస్తున్నాము. మాకు కనబడిన లోపాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ వాటిని సవరించుకోమని కోరుతున్నాము అంతే! ప్రజలు కూడా అన్నీ నిశితంగా గమనిస్తూనే ఉన్నారని మరిచిపోకూడదు,” అని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. 


Related Post