అప్పుడు కేటిఆర్..ఇప్పుడు కవితక్క..

October 07, 2017


img

ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలకు ఆ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు ధీటుగా జవాబు చెప్పారు. ఆయన చేసిన ప్రతివిమర్శలలో కేసీఆర్ తన కూతురు కవితను గెలిపించుకోవడం కోసం సర్వ శక్తులు ఒడ్డారన్న మాట చాలా ఆలోచింపజేసేదే. 

సింగరేణిలో జరిగినవి కార్మిక సంఘాల ఎన్నికలే అయినా వాటి ద్వారా తెరాస ఎంపి కవితను రాజకీయంగా ప్రమోట్ చేయడానికి కేసీఆర్ వాటిని చాలా బాగా ఉపయోగించుకోగలిగారని చెప్పకతప్పదు. ఈ ఎన్నికలలో అయన కవితమ్మకు వెన్నుదన్నుగా నిలిచిన తీరు చూసినప్పుడు గత ఏడాది జరిగిన జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు గుర్తుకు వస్తాయి. 

ఆ ఎన్నికలలో తెరాస విజయం సాధించడం కోసం దాదాపు ఏడాదిపాటు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన తరువాత వాటిలో నూటికి నూరు శాతం విజయం తధ్యం అని ఖరారు చేసుకొన్న తరువాత, ఆ ఎన్నికలలో తెరాసను గెలిపించే బాధ్యతను తన కుమారుడు కేటిఆర్ కు అప్పగించారు. అంటే తెరాస విజయాన్ని బంగారు పళ్ళెంలో పెట్టి తన కుమారుడుకి అందించినట్లు చెప్పవచ్చు. కేటిఆర్ కు వాటి పూర్తి క్రెడిట్ దక్కాలనే ఉద్దేశ్యంతో పార్టీలో హరీష్ రావుతో సహా ముఖ్యనేతలను అందరినీ వాటికి దూరంగా ఉంచారని మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. ఊహించినట్లుగానే ఆ ఎన్నికలలో ఘన విజయం సాధించిన తరువాత కేటిఆర్ రాజకీయ గ్రాఫ్ ఒక్కసారిగా ఏవిధంగా పైపైకి దూసుకుపోయిందో అందరూ చూశారు. 

సరిగ్గా అదేవిధంగా సింగరేణి ఎన్నికలలో కూడా టిబిజికెఎస్ (కవిత) గెలుపుకోసం కేసీఆర్ పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసి, ఎన్నికల చివరి నిమిషం వరకు సమయానుకూలంగా వరాలు, హామీలు, కార్మికులకు బోనసులు అన్నీ అందిస్తూ ఆమెకు కూడా విజయాన్ని బంగారు పళ్ళెంలో పెట్టి అందించారని చెప్పవచ్చు. 

కనుక ఈ విజయంతో ఆమె రాజకీయ గ్రాఫ్ కూడా అమాంతం పైకి దూసుకుపోయింది. ఒంటిచేత్తో ప్రతిపక్షాలన్నిటినీ ఓడించిన ధీరవనితగా ఆమె పేరు సంపాదించుకొన్నారు. పైగా ఈ ఎన్నికల పుణ్యమాని  సింగరేణి కార్మికులతో మంచి పరిచయాలు ఏర్పరచుకోగలిగారు. ఆ కారణంగా సింగరేణిలో 53,000 మంది కార్మికులు, వారి కుటుంబాలు అందరినీ తెరాసవైపు మళ్ళించగలిగారు. 

కనుక ఈ ఘన విజయం కేసీఆర్ ప్రగతి భవన్ లో కూర్చొని సాధించిన విజయంగానే చెప్పవచ్చు. అదే వి హనుమంతరావు కూడా అన్నారు. 

అయితే కేసీఆర్ అందించిన ఈ రెండు గొప్ప అవకాశాలను కేటిఆర్, కవిత చక్కగా సద్వినియోగం చేసుకొని తమ సమర్ధత నిరూపించి చూపుకొని, అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో ఇంకా బలమైన, తిరుగులేని నాయకులుగా ఎదిగారు కనుక ఈ విషయంలో వారిని తప్పుపట్టడానికి ఏమీ లేదు.           



Related Post