తెలంగాణాకు పట్టిన శని కాంగ్రెస్: కేసీఆర్

October 07, 2017


img

సింగరేణి ఎన్నికలలో టిబిజికెఎస్ విజయం సాధించిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. 

“తెలంగాణాను అన్ని విధాల నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీయే. ఒకప్పుడు నెహ్రూ తెలంగాణాకు అడ్డుపడ్డారు తరువాత తెలంగాణా కావాలని అడిగినవాళ్ళను ఇందిరమ్మ కాల్చి చంపించింది. వారి తరువాత వచ్చిన సోనియా గాంధీ తెలంగాణా ఏర్పాటు చేయడానికి ఆమె 14 ఏళ్ళపాటు తెలంగాణా ప్రజలను ఏడిపించి, అనేకమంది ఉసురు పోసుకొంది. ఆమె వందలాది మంది తెలంగాణా ప్రజలను బలి తీసుకొంది. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతూనే ఉన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడూ తెలంగాణాకు ఏమీ చేయలేదు..ఇప్పుడూ మేము చేస్తున్నా అడ్డుపడుతూనే ఉంది. మా ప్రభుత్వం జారీ చేసే ప్రతీ జీవోపై, చేపట్టే ప్రతీ ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు కోర్టులో పిటిషన్లు వేస్తూ అడ్డుపడుతున్నారు. ప్రజలు వారికి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా వారి తీరు మారడం లేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి పట్టిన శని. 2014 ఎన్నికలలోనే దానిని ప్రజలు వదలించుకొన్నప్పటికీ దాని పీడ పూర్తిగా విరగడం అవడం లేదు. మళ్ళీ వచ్చే ఎన్నికలలో ప్రజలే వారికి తగినవిధంగా బుద్ధి చెప్పాలి,” అని కేసీఆర్ అన్నారు. 

కాంగ్రెస్ పార్టీ వలన రాష్ట్రానికే కాదు..యావత్ దేశానికి తీవ్రనష్టం జరిగిందనే మాట వాస్తవం. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి చాలా కాలం పాటు అదే దేశాన్ని, రాష్ట్రాలను పరిపాలించింది. దాని హయంలో అభివృద్ధి జరిగిన మాట నిజమే కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు పూనుకోవడం వలన జరిగిన అభివృద్ధి నామమాత్రమే. 70 ఏళ్ళ కాలంలో అనేకమంది భారతీయులు కృషి పట్టుదల, దీక్షాదక్షతల కారణంగా జరిగిన అభివృద్దే ఎక్కువ. కాంగ్రెస్ ప్రభుత్వాలు దానికి స్పీడ్ బ్రేకర్స్ గా వ్యవహరించి ఉండకపోతే భారత్ నేడు అమెరికా, యూరోప్ దేశాల సరసన అగ్రరాజ్యంగా నిలిచి ఉండేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. 

సమైక్య రాష్ట్రంలో తెలంగాణాకు చెందిన   అనేకమంది కాంగ్రెస్ నేతలు కూడా అధికారం చలాయించినప్పటికీ ఎవరూ కూడా తెలంగాణాకు న్యాయం చేయలేకపోయారు. కనీసం తమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించలేకపోయారు. ఆనాడు సమైక్య రాష్ట్రానికి చిట్టచివరి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కిరణ్ కుమార్ రెడ్డి “తెలంగాణాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను..ఏమి చేస్తారో చేసుకోండి” అని నిండు శాసనసభలో అన్నప్పుడు ఒక్క కాంగ్రెస్ నేత లేచి అభ్యంతరం చెప్పలేదు. ఎందుకంటే రాష్ట్రం కంటే వారి స్వప్రయోజనలే ముఖ్యం కనుక అని భావించవలసి ఉంటుంది. అదే విషయం కేసీఆర్ ఇప్పుడు మరోసారి గుర్తుచేశారు. 

మిగిలిన పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీలో రెండే రెండు గొప్ప సుగుణాలున్నాయి. 1. భావప్రకటన స్వేచ్చ, 2. లౌకికవాదం. అయితే ఆ రెండు సుగుణాలను వారి అవినీతి, అసమర్దత, అలసత్వం, నిర్లక్ష్యం, పదవీలాలస వంటి అవకరాలు కబళించివేశాయి. అందుకే కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు అందరూ పక్కన పెడుతున్నారు. అయినా వారు ఈ సంగతి గ్రహించకుండా తమకు అలవాటైన మూస రాజకీయాలు చేసుకొంటూ అధికారంలోకి రావాలని పగటికలలు కంటున్నారు...పాపం. 

ఏపిలో కాంగ్రెస్ పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. కానీ తెలంగాణాలో ఇంకా బలంగా ఉంది. వచ్చే ఎన్నికల తరువాత తెలంగాణాలో కూడా కనుమరుగయిపోయినా ఆశ్చర్యం లేదు. కనుక కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికైనా మేల్కొని తమ పార్టీ విధానాలను లోతుగా సమీక్షించుకొని సమూలంగా ప్రక్షాళించుకొంటే మంచిది. 


Related Post