రామ్ గోపాల్ వర్మ అంటే ఒక వివాదాలకు కేరాఫ్ అడ్రెస్. అందుకే అయన స్వర్గీయ ఎన్టీఆర్ జీవితకధను ఎంచుకొన్నాడు. అందులో తప్పేమీ లేదు అయితే ఆ సినిమాను ఆయన రెండవ భార్య లక్ష్మీ పార్వతి కోణంలో నుంచి తీయలనుకోవడమే వివాదానికి నాంది. అందుకే ఆ సినిమాకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అని పేరు పెట్టాడు. సినిమా పేరు ప్రకటించిన తరువాత తన ఉద్దేశ్యాలను కూడా స్పష్టంగానే చెప్పారు. ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ ను ఎవరు వెన్నుపోటు పొడిచారో వారి నిజస్వరూపాలను బయటపెడతానని ప్రకటించేశారు. అంటే తెదేపా అధినేత చంద్రబాబు నాయుడును టార్గెట్ చేసుకోబోతున్నానని విస్పష్టంగానే చెప్పారు.
అయితే విచిత్రమేమిటంటే, లక్ష్మీ పార్వతి తప్ప ఇంతవరకు తెదేపా నేతలు కానీ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు గానీ ఆ సినిమా గురించి ఒక్క ముక్క మాట్లాడలేదు. ఇక చంద్రబాబు నాయుడును టార్గెట్ గా చేసుకొని సినిమా తీస్తున్నాడంటే, వైకాపా సంతోషించకుండా ఉండదు. ఆ సినిమాకు వైకాపా నేతలే ఎవరో ఒకరు పెట్టుబడి పెడతారని ఇదివరకే ఊహించాము. ఊహించినట్లుగానే దానికి వైకాపా నేత పి రాకేశ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు.
ఈ విషయం తన ఫేస్ బుక్ ద్వారా తెలియజేస్తూ, “నా దర్శకత్వంలో వస్తున్న “లక్ష్మి'స్ యన్ టి ఆర్” చిత్రాన్ని నిర్మిస్తున్నది వై.ఎస్.అర్.సి.పి. నేత పి.రాకేష్ రెడ్డి.....మా ఇద్దరి ఆంతరంగిక అభిమతం ఈ చిత్రాన్ని పాలిటిక్స్ కి అతీతంగా కేవలం నిజాలు చెప్పడం కోసమే తియ్యాలని,” అని మెసేజ్ పెట్టాడు.
ఆ సినిమాకు ఆ పేరు ఎంచుకొన్నప్పుడే అయన ఉద్దేశ్యాలు బయటపడ్డాయి. ఇప్పుడు దానిని తెదేపాకు బద్ధ విరోధి అయిన వైకాపా (నేత) నిర్మించబోతుండటం గమనిస్తే దీనిలో సినిమా కంటే రాజకీయమే ఎక్కువగా కనబడుతోంది. కానీ రాజకీయాలకు అతీతంగా వాస్తవాలు చెపుతానని వర్మ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుని శత్రువుగా భావించడానికి రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయి కానీ రామ్ గోపాల్ వర్మకు కూడా చంద్రబాబుతో ఎందుకు శత్రుత్వం ఏర్పడిందో తెలియదు. కారణాలు ఏవైనప్పటికీ, ఈ సినిమాను చంద్రబాబుపై అయన ఒక వజ్రాయుధంగా ప్రయోగించబోతున్నాడని స్పష్టమవుతోంది. దానికి వైకాపా, లక్ష్మీ పార్వతి సహకరిస్తే ఆశ్చర్యమేమీ లేదు. మరి దీనిని తెదేపా ఏవిధంగా ఎదుర్కొంటుందో చూడాలి.