సింగరేణికి బయ్యారం గనులు అప్పగిస్తాం: కేసీఆర్

October 07, 2017


img



  

టిబిజికెఎస్ గెలిస్తే అది సింగరేణిని నాశనం చేస్తుందని సింగరేణి ఎన్నికలలో ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న జవాబు చెప్పారు. తమని గెలిపించినందుకు సింగరేణిని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఇంతవరకు కేవలం బొగ్గు త్రవ్వకాలకే పరిమితమయిన సింగరేణిని ఇక వివిధ గనుల త్రవ్వకాల బాధ్యతలు కూడా అప్పగించి సింగరేణిని విస్తరిస్తామని చెప్పారు. త్వరలోనే బయ్యారం ఇనుప గనులను సింగరేణికి అప్పగిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.

 సింగరేణి నష్టపోకుండా ముందుకు సాగాలంటే ఓపెన్ కాస్ట్ గనులు నిర్వహించడం తప్పనిసరి అని తెలిపారు. వాటి ద్వారానే సింగరేణికి లాభాలు వస్తున్నాయని, వాటినే భూగర్భ గనులకు వెచ్చిస్తున్నామని తెలిపారు. ఆవిధంగా రెంటినీ సమానంగా బ్యాలెన్స్ చేసుకొంటూ ఒకపక్క ఉద్యోగాలు కల్పిస్తూ మరోపక్క లాభాలబాటలో సింగరేణిని నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. 

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు కోర్టులు బ్రేక్ వేశాయి కనుక కారుణ్య నియామకాల పద్దతిలో దానిని అమలుచేస్తామని తెలిపారు. కారుణ్య నియామకాల ద్వారా తమ పిల్లలకు ఉద్యోగాలు వద్దనుకొనే కార్మికులకు ఒక్కొక్కరికీ రూ.25 లక్షలు ఏకమొత్తంలో చెల్లిస్తామని చెప్పారు. పిల్లలు లేని ఆశక్తులైన కార్మికులకు ఈ విధానంలో ఉద్యోగ విరమణ చేయదలిస్తే ఒక్కొక్కరికీ వారి పదవీ విరమణ కాలం వరకు నెలకు రూ.25,000 చొప్పున జీతం ఇస్తామని చెప్పారు. అలాగే ఇల్లు నిర్మించుకోవడానికి రూ.6లక్షలు వడ్డీలేని రుణాలు కూడా ఇస్తామని తెలిపారు.

 ఆర్టీసీలో మాదిరిగానే సింగరేణి పాలకమండలి బోర్డులో కూడా సింగరేణి కార్మికులను డైరెక్టర్లుగా నియమిస్తామని తెలిపారు. సింగరేణిలో 11 డివిజన్లకు టిబిజికెఎస్ ఉపాధ్యక్షులను నియమిస్తామని తెలిపారు. ఆర్టీసి, విద్యుత్, సింగరేణి..ఈ మూడు సంస్థలపై లక్షలాది మంది ఉద్యోగులు వారి కుటుంబాలు ఆధారపడున్నారు కనుక మూడింటినీ బలోపేతం చేసి లాభాల బాట పట్టించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకొంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.            



Related Post