ప్రాంతాలుగా విడిపోయినా అన్నదమ్ములుగా కలిసి ఉందాం అంటూ ఏపి, తెలంగాణా రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నా సరే తెలంగాణా కళకారులకు మాత్రం తగినంత ప్రోత్సాహం, అవకాశాలు అందటం లేదు అన్నది అందరికి తెలిసిన నిజం. టాలీవుడ్ అంటే కొందరు తప్ప మిగతా అంతా ఆంధ్రాకు చెందిన వారే అన్న భావన ఉంది.. అది నిజం కూడా.
తెలంగాణాలో ప్రతిభ గల నటులు, దర్శకులు, రచయితలు లేరా అంటే ఉన్నారు.. కాని వారికి తగినన్ని అవకాశాలు రావట్లేదు. వారి ప్రతిభను ప్రదర్శించే ఫ్లాట్ ఫాం దొరకట్లేదు. తెలంగాణా భూమిపై పుట్టి పరదేశంలో సెటిల్ అయిన ఎన్నారైలు కలిసి అన్ని రంగాల్లో తెలంగాణా రాష్ట్రాభివృద్దికి కృషి చేస్తున్న వారితో డిస్కషన్స్ జరుపుతున్న ప్రోగ్రాం డయల్ యువర్ విలేజ్.
అమెరికాలోని తెలంగాణా అసోషియేషన్ సభ్యులంతా కలిసి డయల్ యువర్ విలేజ్ ప్రోగ్రాంతో ఏరకంగా అన్ని రంగాల్లో తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందో కాన్ఫరెన్స్ డిస్కషన్స్ చేస్తున్నారు. ఇక ఈ వారం ఈ కార్యక్రమంలో తెలంగాణా దర్శక నిర్మాత, నటుడు, రచయిత ఒకటి కాదు రెండు కాదు 24 క్రాఫ్ట్స్ లో తన పనితనం చూపించిన తెలంగాణ దర్శక నిర్మాత సయ్యెద్ రఫితో సంభాషించడం జరిగింది.
హుస్నాబాద్ నుండి వచ్చిన తను చిన్ననాటి నుండి కళల మీద ఆసక్తి ఉండటంతో సినిమాల్లో రాణించాలని అనుకున్నారట. మొదట్లో ఓ వీడియో ఆల్బం ద్వారా తొలి ప్రయత్నం చేసిన రఫి తన తొలి సినిమా మధురం రిలీజ్ సమయంలో జరిగిన విషయాలను పంచుకున్నారు. మదురం సినిమా ఎంతో కష్టపడి సొంత డబ్బులతో నిర్మించామని.. అయితే ఆ సినిమా ఆడకుండా చేశారని అన్నాడు. అంతేకాదు తను తెలంగాణా ఉద్యమం మీద చేసిన ఇంకెన్నాళ్లు సినిమా కూడా అప్పట్లో ఓ సంచలనం సృష్టించగా ఆ సినిమాకు 5 నంది అవార్డులు వచ్చినా కేవలం సపొర్టింగ్ యాక్ట్రెస్ ఒకటి ఇచ్చేసి చేతులు దులుపుకున్నారనే విషయాన్ని బట్టబయలు చేశారు.
ఎవరో రావాలి ప్రొడ్యూస్ చేయాలి అన్న ఆలోచన కాకుండా తన సొంతంగా సినిమా తీసేందుకే ప్రయత్నించామని అన్నారు. తెలంగాణాలో ప్రతిభ గల వారికి అవకాశాలు రావాలంటే తెలంగాణా ప్రభుత్వం కూడా తగినంత సహకారం అందించాలని అన్నారు. ఇక అందులో భాగంగానే ఫిల్మ్ ఇన్స్ టిట్యూట్స్, సబ్సిడి, మిని థియేటర్ కల్చర్ కొత్తగా తీసుకురావాలని అన్నారు.
తెలంగాణాకు సెపరేట్ ఎఫ్.డి.సి (ఫిల్మ్ డెవెలప్మెంట్ కార్పోరేషన్) ఏర్పడినా తెలంగాణా సినిమాకు, కళాకారులకు ఇంకా సరైన న్యాయం జరుగట్లేదు అన్నది తెలిసిన విషయమే. దీనికి ప్రభుత్వం తరపునుండి ఎంతో సహకారం అందాల్సి ఉందని రఫి అన్నారు. అప్పట్లోనే తను తీసిన ఇంకెన్నాళ్లు సినిమా వల్ల తెలంగాణా భాష, మాండలికం, కట్టు బొట్టు, వ్యవహారశైలి గురించి మాట్లాడటం మొదలు పెట్టారు.
ఇక ఇప్పుడు మన సంస్కృతితో ఆంధ్రా వాళ్లు సినిమాలు తీసి కమర్షియల్ గా సక్సెస్ అవుతున్నారు. మన దగ్గర టాలెంట్ ఇంప్రూవ్ చేసుకుంటే మన సంస్కృతి గురించి మనమే సినిమాలు తీసేయొచ్చని అన్నారు. తెలంగాణా కళాకారుల ప్రతిభకు సిఎం కె.సి.ఆర్ కూడా సహకారం అందించి తెలంగాణా సినిమాకు తగినంత ప్రోత్సాహం ఇవ్వాలని ఆశిస్తున్నారు.