వారిది అనైతిక కూటమైతే...

October 06, 2017


img

సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలలో తెరాస అనుబంధ సంఘం టిబిజికెఎస్ ఘన విజయం సాధించింది. అది గొప్ప విషయమే. కనుక తెరాస నేతలు విజయోత్సాహంతో సంబురాలు చేసుకోవడం కూడా సమంజసమే. అయితే ఆ ఉత్సాహంలో తమ చేతిలో ఘోరంగా ఓడిపోయిన ప్రతిపక్షాలను విమర్శించడం అవసరమా? అని ఆలోచించుకోవాలి. మంత్రి కేటిఆర్ తో సహా కొంతమంది తెరాస నేతలు, ఈ ఎన్నికలలో ప్రతిపక్షాలు అనైతికకూటమి కట్టి తమపై దుష్ప్రచారం చేశాయని అయినా కార్మికులు వారి మాటలను నమ్మకుండా వారిని త్రిప్పికొట్టారని చెపుతున్నారు. 

ఒక సాధారణ కార్మిక సంఘాల ఎన్నికలను రాజకీయ ఎన్నికల రణరంగంగా మార్చినది తెరాసయే అని అందరికీ తెలుసు. వాటిని ఆ స్థాయికి తీసుకువెళ్ళడమే కాకుండా ఇతర సంఘాల నేతలను ఎన్నికలకు ముందు తమ సంఘంలోకి ఫిరాయింపజేయడం అనైతికమే కదా? ఒకప్పుడు ఉద్యమకారులతో నిండి ఉండే తెరాసలో ఇప్పుడు వారికంటే ఇతర పార్టీలవారే ఎక్కువ ఉన్నారు కదా? తెరాసకు ఎదురు లేకుండా చేసుకోవడానికి ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రతిపక్షాలను రాజకీయంగా బలహీనపరుస్తూ దానికి “బంగారి తెలంగాణా కోసం రాజకీయ పునరేకీకరణ” అనే అందమైన ముసుగు తొడిగి సమర్ధించుకొంటున్నప్పుడు, సింగరేణి ఎన్నికలలో ప్రతిపక్షాలు చేతులు కలిపితే అనైతికం ఎలా అవుతుంది. 

ఎన్నికల యుద్ధంలో గెలిచేందుకు తెరాస ఏవిధంగా రాజకీయ ఎత్తుగడలు, రకరకాల వ్యూహాలు అమలు చేసిందో, అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా తమ పరిధిలో ఉన్న అవకాశాలను ఉపయోగించుకొని చేతులు కలిపి ముందుకు సాగాయి. ఒకవేళ అది అనైతికమైతే ఈ ఎన్నికలలో గెలిచేందుకు తెరాస అమలుచేసిన వ్యూహాలు కూడా అనైతికమేనని ప్రతిపక్షాలు విమర్శిస్తే వాటికి తెరాస సర్కార్ జవాబు ఏమిటి? 

ఎన్నికల తేదీ ప్రకటించినప్పటి నుంచి ప్రచారం ముగిసేవరకు సింగరేణి కార్మికులకు తెరాస సర్కార్ ఎన్ని వరాలు ప్రసాదించిందో అందరూ చూసారు. ఎన్నికలకు ముందు ఉద్యోగ ప్రకటనలు చేయడం, మూడు రోజుల ముందు కార్మికులకు బారీగా బోనసులు, జీతాలు అందించడం, భద్రాది కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు పట్టణంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకొన్నవారికి 100 గజాల లోపు భూములను క్రమబద్దీకరించడం వంటివన్నీ తెరాస ఏవిధంగా సమర్ధించుకోగలదు?

తెరాస సర్కార్ చక్కటి పరిపాలన అందించడం నిజమే. రాష్ట్రాన్ని అన్నివిధాల అభివృద్ధి చేస్తున్న మాట కూడా నిజమే. అనేకానేక సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్న మాట కూడా నిజమే. అయితే పరిపాలన వేరు..రాజకీయాలు వేరు కనుక, రాజకీయాలలో తను బలపడేందుకు ప్రత్యర్ధులను నిర్వీర్యం చేయడానికి తన ముందున్న అన్ని అవకాశాలను అది వినియోగించుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. తెరాస ధాటికి తమ ఉనికిని, భవిష్యత్ ను కోల్పోతున్న ప్రతిపక్షాలు వాటిని కాపాడుకోవడం కోసం చేసే పోరాటాలను తప్పు పట్టలేము. అది కూడా రాజకీయాలలో సహజమేనని అంగీకరించక తప్పదు. 


Related Post