పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీగా నిర్ణయించుకోవడానికి పెట్రోలియం కంపెనీలను అనుమతించినప్పటి నుంచి, అది ధరలు పెంచుకోవడానికి అనుమతించినట్లుగా భావిస్తూ రోజూ ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచుకొంటూపోయాయి. జి.ఎస్.టి. అమలులోకి వచ్చేక వాటిపై స్థానిక పన్నులు, వ్యాట్, ఎక్సైజ్ టాక్స్ వగైరాలన్నీ తొలగిపోతాయి కనుక వాటి ధరలు బారీగా తగ్గిపోతాయనే ప్రజల ఆశలు భ్రమలుగానే మిగిలిపోయాయి. పైగా రోజురోజుకు ధరలు పెరిగిపోసాగాయి.
దీనిపై సామాన్య ప్రజలు ఆగ్రహంగా ఉన్నారనే సంగతి ఎట్టకేలకు డిల్లీ ప్రభువుల చెవిన పడింది. పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ త్వరలోనే ఒక శుభవార్త వినబోతున్నారంటూ మీడియాతో అన్నారు. ప్రజల కోరిక మేరకు పెట్రోల్, డీజిల్ లను కూడా జి.ఎస్.టి. పరిధిలొకి తీసుకురాబోతోందని, దానితో వాటి ధరలు అమాంతం 50 శాతం వరకు తగ్గిపోనున్నాయని మీడియాలో చాలా ఊహాగానాలు వినిపించాయి.
కానీ పెట్రోల్, డీజిల్ పై వచ్చే బారీ రాబడిని వదులుకోవడానికి ఏమాత్రం ఇష్టపడని కేంద్రప్రభుత్వం వాటిపై ఎక్సైజ్ టాక్స్ ను లీటరుకు రూ.2 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఆమేరకు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ఈరోజు మీడియాకు తెలియజేశారు. గత మూడునాలుగు నెలల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు కనీసం రూ. 7 నుంచి 9 వరకు పెంచేసాయి. ఇప్పుడు రెండు రూపాయలు తగ్గించి పండగ చేసుకోమంటోంది ప్రభుత్వం.