తెరాసతో పొత్తులు మంచిదే: మోత్కుపల్లి

October 03, 2017


img

 కేంద్రప్రభుత్వం మొన్న ఐదు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవులకు కొత్తగా గవర్నర్లను నియమించడంతో, ఎప్పటికైనా గవర్నర్ పదవి వస్తుందనే ఆశతో గత మూడేళ్ళుగా ప్రత్యక్ష రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్న తెలంగాణా తెదేపా సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు తీవ్ర నిరాశ చెందడం సహజమే. బహుశః ఆ నిరాశతోనే అయన మళ్ళీ రాజకీయాల గురించి మాట్లడినట్లున్నారు. 

గవర్నర్ల నియామకాలు జరిగిన తరువాత మీడియాతో మాట్లాడుతూ “కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకిస్తూ పుట్టిన పార్టీ తెలుగుదేశం కనుక తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపే అవకాశం లేదు. భాజపాతో మాకు మంచి స్నేహసంబంధాలే ఉన్నాయి కనుక దానితో మళ్ళీ కలిసి పనిచేయడం సాధ్యమే. లేకుంటే తెరాసతో కూడా కలిసి పనిచేయవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కాదని భావిస్తున్నాను. ఏపి, తెలంగాణా ముఖ్యమంత్రులిద్దరూ రెండు తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేయడానికి చాలా కృషి చేస్తున్నారు. కనుక వారిద్దరూ కలిసి పనిచేస్తే అద్భుతాలు సాధించవచ్చు,” అన్నారు మోత్కుపల్లి నరసింహులు.

తెలంగాణాలో తమ పార్టీ తెరాస సర్కార్ కు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ, ఆ ప్రయత్నంలో భాగంగా అనేక సమస్యలపై కాంగ్రెస్ పార్టీతో కలిసిపోరాడుతున్న సంగతి అపార రాజకీయ అనుభవజ్ఞుడైన మోత్కుపల్లికి తెలియదనుకోలేము. అలాగే తెదేపాతో కలిసి పనిచేయడానికి ఇష్టపడని భాజపా దానితో అనధికారికంగా తెగతెంపులు చేసుకొని తెరాసకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేసిన సంగతి మోత్కుపల్లికి తెలిసే ఉండాలి. కానీ తెదేపాను బడ్డ విరోధిగా భావిస్తున్న తెరాసతో కలిసి పనిచేస్తే బాగుంటుందని చెప్పడం విచిత్రంగా కనిపిస్తున్నా, ఆయన తెరాసవైపు చూస్తున్నట్లనిపిస్తోంది. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు నేటికీ నరసింహన్ ఉమ్మడి గవర్నర్ గా ఉన్నారు. ఒకవేళ భవిష్యత్ లో రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా గవర్నర్లను నియమించే అవకాశం ఉంది. కనుక మోత్కుపల్లి బహుశః అంతవరకు ఓపికపట్టవచ్చు. 



Related Post