తెదేపాకు జనసేన జలక్?

October 03, 2017


img

 “వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ మొత్తం 175 స్థానాలకు పోటీ చేస్తుంది లేదా విజయావకాశాలున్న చోట్ల మాత్రమే పోటీ చేస్తుందని” ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా ట్విట్టర్ పేజిలో నిన్న ఒక పోస్ట్ పెట్టారు. ఆ విషయం మీడియాలో ప్రముఖంగా రావడంతో వెంటనే దానిని తొలగించారు. 

దానిపై ఆ పార్టీ ప్రతినిధులు మీడియాకు ఇచ్చిన సంజాయిషీ ఇస్తూ ఇటీవల జరిగిన సమావేశంలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ సమాధానంగా “అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకొందామని” చెప్పారు. దానిని అతను తప్పుగా అర్ధం చేసుకొని ఈ మెసేజ్ పెట్టారు. అందుకే దానిని వెంటనే తొలగించాము,” అని చెప్పారు. 

వచ్చే ఎన్నికలలో రెండు తెలుగు రాష్ట్రాలలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ఇదివరకే స్వయంగా ప్రకటించారు. ట్విట్టర్ లో పెట్టిన మెసేజ్ కూడా అందుకు అనుగుణంగానే ఉంది. అయితే నిర్దిష్టంగా 175 స్థానాలకు పోటీ చేయవచ్చని నిన్న ట్విట్టర్ లో ప్రకటించడంతో అందరిలో ఆలోచన రేకెత్తించింది. 

ఏపిలో అన్ని స్థానాలకు పోటీ చేయడం అంటే తెదేపాను డ్డీకొంటామని చెప్పినట్లే అయ్యింది. కానీ అంతలోనే ‘తూచ్’ అంటూ ఆ మెసేజ్ ను చెరిపేసి ‘అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకొంటామని’ చెప్పడం విశేషం. కనుక జనసేన పొరపాటున 175 స్థానాలకు పోటీ చేస్తామని ప్రకటించిందా లేక తెదేపా స్పందన తెలుసుకోవడానికే ఈ మెసేజ్ పెట్టిందా? అనేది మున్ముందు తెలుస్తుంది. అయితే అది భాజపాతో కటీఫ్ చేసుకొని తెదేపాతో మాత్రమే కలిసి పనిచేయడం సాధ్యం కాదు కనుక వచ్చే ఎన్నికలలో జనసేన ఒంటరిగానే పోటీ చేసే అవకాశాలున్నాయి. అదే విషయం దాని తాజా ట్వీట్ స్పష్టం చేస్తోంది. 


Related Post