కర్నాటకకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యను దేశంలో రాజకీయ పార్టీలన్నీ ఖండిస్తున్నా ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వహించడంపై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం బెంగళూరులో జరిగిన డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సదస్సును ప్రకాష్ రాజ్ ప్రారంబించారు.
ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “జర్నలిస్ట్ గౌరీ లంకేష్ ను గుర్తు తెలియని దుండగులు అతికిరాతకం హత్యచేస్తే అందుకు బాధపడకపోగా సోషల్ మీడియాలో కొందరు సంతోషపడుతుండటం చూసి షాక్ అయ్యాను. ఆమె చంపిన వ్యక్తులు ఎవరో మనకు తెలియకపోవచ్చు. కానీ సోషల్ మీడియాలో ఆమె హత్యను పండుగ చేసుకొంటున్నవారెవరో అందరికీ స్పష్టంగా కనబడుతూనే ఉంది.
యావత్ దేశం ఆమె హత్యను ఖండించినా, ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం అసలు ఈ విషయం తనకు తెలియనట్లు అద్భుతంగా నటిస్తున్నారు. ఆయన కళ్ళు మూసుకొని మౌనం నటిస్తుంటే, నాకంటే ఆయనే గొప్ప నటుడు అనిపిస్తోంది. అది చూసి నాకు వచ్చిన 5 జాతీయ అవార్డులు ఆయనకే ఇచ్చేయలనిపిస్తోంది. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ఇటువంటి సున్నితమైన విషయాలలో స్పందించకుండా మౌనం వహించడం సరికాదు. కానీ మౌనం వహిస్తున్నారంటే ప్రజలకు వివేకజ్ఞానంలేనివాళ్ళని భావిస్తున్నట్లు అనుకోవలసి ఉంటుంది,” అని ప్రకాష్ రాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కర్నాటక రాష్ట్రంలో భాజపా దాదాపు రెండున్నర దశాబ్దాలు రాజ్యం చేసింది. కానీ ఎద్యూరప్ప అవినీతి భాగోతాల కారణంగా అధికారం కోల్పోయింది. ఇప్పుడు సిద్దరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కనుక మళ్ళీ వచ్చే ఎన్నికలలో ఎలాగయినా గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని భాజపా తహతహలాడుతోంది. మరి అటువంటప్పుడు కర్నాటక ప్రజలను ప్రసన్నం చేసుకొనేవిధంగా భాజపా వ్యవహరించాలి కానీ ప్రకాష్ రాజ్ మాటలు విన్నట్లయితే కర్నాటక ప్రజల ఆగ్రహానికి భాజపా గురవుతోందని స్పష్టం అవుతోంది.
గోరక్షక్ లు హద్దుమీరి ప్రవర్తిస్తూ తమ పార్టీకి, ప్రభుత్వానికి అప్రదిష్ట కలిగిస్తున్నప్పుడు వారిని గట్టిగా హెచ్చరించి కట్టడి చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, కర్నాటక ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేవిధంగా జరిగిన గౌరీ లంకేష్ హత్య...దానిపై సోషల్ మీడియాలో జరుగుతున్న సంబురాలను గట్టిగా ఖండించకపోవడం విస్మయం కలిగిస్తుంది. అది రాష్ట్రంలో భాజపా పట్ల ప్రజలలో వ్యతిరేకతను, సిద్దరామయ్య ప్రభుత్వానికి సానుకూలంగాను మారే అవకాశం ఉంటుందని చెప్పకతప్పదు.