“పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డిని తక్షణం పదవిలో నుంచి తొలగించకపోతే నేను పార్టీకి గుడ్ బై చెప్పేసి నా దారి నేను చూసుకొంటాను..” అని బెదిరించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు చిత్రవిచిత్రంగా మాట్లాడుతుండటం విశేషం. నా దారి నేను చూసుకొంటానని చెప్పినప్పుడే అయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నానని చాటి చెప్పుకొన్నట్లయింది. కానీ ఇప్పుడు “గుత్తా సుఖేందర్ రెడ్డిలాగ నాకు పూటకో పార్టీ మారే అలవాటు లేదు. పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చినా ఇవ్వకున్నా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను,” అని చెప్పడం విశేషం.
ఆయన ఈరోజు నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణా ఏర్పడినప్పటికీ రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతుండటం చాలా బాధాకరం. తెరాస సర్కార్ పనితీరు, దాని పోకడల పట్ల తెలంగాణా ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దానికి బుద్ధి చెప్పవలసిన సమయం ఆసన్నమైంది. నల్లగొండ లోక్ సభ ఉపఎన్నికలే అందుకు సరైన వేదిక. ఒకవేళ గుత్తా సుఖేందర్ రెడ్డి బరిలో దిగినట్లయితే ఆయనపై నేనే పోటీ చేసి గెలిచి చూపిస్తాను. 2019 ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి రావడం ఖాయం,” అని అన్నారు.
వాస్తవానికి తెలంగాణా ఏర్పడినప్పుడే కొత్త రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అత్యంత అనుకూలమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కానీ అప్పుడు కాంగ్రెస్ నేతలు తమలో తామే కీచులాడుకొంటూ విలువైన సమయం వృధా చేసేశారు. అందరూ డిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఎవరికి వారు టికెట్లు సాధించుకోవాలని ప్రయత్నించారు తప్ప కలిసికట్టుగా పనిచేసి ఎన్నికలలో పార్టీని గెలిపించుకోవాలని ప్రయత్నించలేదు.
మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తున్నా కాంగ్రెస్ నేతల తీరు మారలేదు. పార్టీలో ఎవరికీ ఎవరితోనూ పడదు. ఎవరికివారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తుంటారు. సింగరేణి ఎన్నికలలో తెరాస నేతలందరూ కలిసికట్టుగా పనిచేస్తూ విజయం కోసం కృషి చేస్తుంటే, ఆ ఎన్నికలతో తమకు అసలు సంబంధం లేదన్నట్లు..అది ఉత్తం కుమార్ రెడ్డికి సంబంధించిన సమస్య అన్నట్లుగా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారు. ఈవిధంగా కీచులాడుకొంటూ వచ్చే ఎన్నికలలో తెరాసను ఓడిస్తామని, తామే అధికారంలోకి వస్తామని ఏ నమ్మకంతో చెపుతున్నారో వారికే తెలియాలి.