జయలలిత మృతి తరువాత చాలా చురుకుగా పావులు కదిపి ముఖ్యమంత్రి అయిపోదామని కలలు కన్న శశికళ అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళ జైలు శిక్ష అనుభవిస్తుంటే, ఆమె భర్త నటరాజన్ చెన్నైలో ఒక ప్రముఖ ఆసుపత్రిలో చావుబ్రతుకుల మధ్య ఊగిసలాడుతున్నారు. ఆయనకు కిడ్నీలు, కాలేయం, ఊపిరి తిత్తులు పాడైపోయాయని వైద్యులు చెప్పారు. ఆయనకు త్వరలోనే కాలేయ మార్పిడి ఆపరేషన్ చేయబోతున్నట్లు వైద్యులు ప్రకటించారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో తన భర్త పక్కన ఉండాలని కోరుకొంటున్నానని కనుక తనకు రెండు వారాలు పెరోల్ పై జైలు నుంచి విడుదలచేయాలని కోరుతూ శశికళ కర్ణాటక హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. దానిపై త్వరలోనే కోర్టు తన నిర్ణయాన్ని వెలువరించుతుంది.
అయితే ఆమె భర్తకు సేవలు చేయాలనే వంకతో పెరోల్ పై బయటకు వచ్చినట్లయితే ఇప్పుడు పళనిస్వామికి వైపున్న అన్నాడిఎంకె ఎమ్మెల్యేలు, ఆమెను చూసి భయపడి మళ్ళీ దినకరన్ వైపు మారిపోయినట్లయితే పళని ప్రభుత్వం కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది కనుక ఆమెకు పెరోల్ మంజూరు చేయకుండా పళనిస్వామి సర్కార్ అడ్డుపడే ప్రయత్నం చేయవచ్చు. కనుక ఒకవేళ న్యాయస్థానం ఆమెకు పెరోల్ మంజూరు చేసినా, చాలా కటినమైన షరతులు విధించవచ్చు.