ఆ మహనీయులకు దేశమంతా ఘన నివాళి

October 02, 2017


img

అక్టోబర్ 2 అంటే గాంధీ జయంతి అని అందరికీ తెలుసు కానీ చిరకాలంగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ గాంధీ, నెహ్రూలకు ఇచ్చినంత ప్రాధాన్యం దేశ రెండవ ప్రధానిగా చేసిన స్వర్గీయ లాల్ బహద్దర్ శాస్త్రికి ఈయకపోవడం వలన అయన జయంతి కూడా ఈరోజేనని ప్రత్యేకంగా చెప్పుకోవలసివస్తోంది.

మహాత్మా గాంధీజీ 1869, అక్టోబర్ 2న గుజరాత్ లోని పోర్ బందర్ లో జన్మించగా, శాస్త్రిగారు యూపిలోని వారణాసి సమీపంలో మొఘల్ సరాయ్ అనే ప్రాంతంలో 1904, అక్టోబర్ 2న జన్మించారు.

వారిరువురూ దేశస్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులే. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తరువాత గాంధీజీ ప్రత్యక్ష రాజకీయాలలోకి రాలేదు శాస్త్రిగారు వచ్చారు అంతే తేడా. శాస్త్రిగారు ప్రధానిగా ఉన్నప్పుడే 1965లో భారత్-పాక్ యుద్ధం జరిగింది. ఆనాడు భారతీయులలో ఉత్తేజం నింపిన ‘జై జవాన్ జై కిసాన్’ అంటూ ఆయన చేసిన నినాదం నేటికీ ఎవరూ మరిచిపోలేదు. ఆనాటి యుద్ధంలో పాకిస్తాన్ కూడా ఊహించనంత వేగంగా దానిని ఓడించి ‘పొట్టివాడైనా గట్టివాడు’ అని ప్రజల ప్రశంసలందుకొన్నారు. 

మహాత్మా గాంధీజీ 1948, జనవరి 30న గాడ్సే చేతులలో ప్రాణాలు కోల్పోగా, శాస్త్రిగారు తాష్కెంట్ ఒప్పందం కోసం రష్యా వెళ్ళినప్పుడు 1966, జనవరి 11వ తేదీన అక్కడ అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఇద్దరూ అక్టోబర్ 2వ తేదీనే పుట్టారు. ఇద్దరూ జనవరి నెలలోనే హత్యకు గురవడం నేటికీ ఎవరూ జీర్ణించుకోలేని చేదు నిజం.   

ఈరోజు వారిరువురి జయంతి కనుక ప్రధాని నరేంద్ర మోడీతో సహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు వారికి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వారిరువురికి నివాళులు తెలుపుతూ ట్విట్టర్ లో రెండు వేర్వేరు వీడియో క్లిపింగ్స్ పోస్ట్ చేశారు. 


Related Post