సింగరేణి విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలేనని కాంగ్రెస్, తెదేపా, సిపిఐ నేతలు విమర్శించారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి, తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలే ఇప్పటి వరకు అమలుచేయకుండా, మళ్ళీ కొత్త వాగ్ధానాలు చేస్తున్నారని ఉత్తం కుమార్ రెడ్డి విమర్శించారు. సింగరేణి ఎన్నికలలో ఓడిపోతామనే భయంతోనే కార్మికులను మభ్యపుచ్చడానికి మళ్ళీ కొత్త వాగ్దానాలు చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణి విషయంలో ముఖ్యమంత్రి చెపుతున్నవన్నీ అబద్దాలేనని, ఆ హోదాలో ఉన్న వ్యక్తి ఈవిధంగా అబద్దాలు చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. సింగరేణి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులపై హటాత్తుగా ఇంత ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రికి కార్మికులపై నిజంగా ప్రేమ ఉండి ఉంటే, మూడున్నరేళ్ళవుతున్నా ఇంతవరకు వారసత్వ ఉద్యోగాలను ఎందుకు అమలుచేయలేదని, వాటి గురించి ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారని ఉత్తం కుమార్ రెడ్డి ప్రశ్నించారు. కార్మికులను మభ్యపెట్టడానికే వాటికోసం జీవో ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ కోర్టులో పిటిషన్ వేయించి అడ్డుకొన్నారని ఆరోపించారు.
చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ, “సింగరేణి కార్మికులు చెమటోడ్చి కష్టపడితే ఈ మూడేళ్ళలో సంస్థకు రూ.1,400 కోట్లు లాభాలు వచ్చాయని కానీ రూ.395 కోట్లు మాత్రమే లాభాలు వచ్చినట్లు చూపించి కార్మికులను సంస్థ యాజమాన్యం మోసగిస్తోందని ఆరోపించారు. తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి నేటి వరకు సింగరేణిలో సుమారు 11,000 ఉద్యోగాలు ఖాళీ అయితే కేవలం 2-3,000 ఉద్యోగాలు భర్తీ చేసి తెరాస నేతలు ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. తెరాస అధికారంలోకి వస్తే సింగరేణిలో అసలు కాంట్రాక్ట్ వర్కర్లే ఉండరని, అందరూ పర్మనెంట్ ఉద్యోగులే ఉంటారని ఆనాడు కేసీఆర్ గొప్పలు చెప్పారని కానీ నేటికీ సింగరేణిలో 25,000 మందికి పైగా పనిచేస్తున్నారని అన్నారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “కార్మికులకు ఇచ్చిన హామీలు అమలుచేయకపోవడంతో వారికి తన మొహం చూపించలేకనే కేసీఆర్ సింగరేణిలో అడుగుపెట్టకుండా ప్రగతి భవన్ లో కూర్చొని మళ్ళీ కొత్త హామీలు గుప్పిస్తున్నారని విమర్శించారు. వారసత్వ ఉద్యోగాల విషయంలో మాట తప్పిన కేసీఆర్ ఇప్పుడు కారుణ్య ఉద్యోగాలతో వాటిని ముడిపెట్టి మాట్లాడుతూ కార్మికులను గందరగోళపరిచి, ఈ ఎన్నికలలో గట్టెక్కాలని ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
తెరాస సర్కార్ వారసత్వ ఉద్యోగాల కోసం జీవో: 39 విడుదలచేస్తే, తెరాస ఎంపి కవిత ఆధ్వర్యంలో నడుస్తున్న తెలంగాణా జాగృతికి చెందిన సతీష్ కుమార్ అనే వ్యక్తి వారసత్వ ఉద్యోగాలను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ వేయడం, ఆ కేసును తెరాస న్యాయవిభాగానికి చెందిన సత్యంరెడ్డి కోర్టులో వాదించడం గమనిస్తే, కేసీఆర్ కు నిజంగా వారసత్వ ఉద్యోగాలు కల్పించే ఆలోచనలేదని స్పష్టం అవుతోందని విమర్శించారు. అందుకే ఇప్పుడు వాటిని కారుణ్యఉద్యోగాలతో ముడిపెట్టి కార్మికులను గందరగోళపరిచి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఇదివరకు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా మళ్ళీ కొత్త హామీలు, వరాలు ప్రకటించి సింగరేణి కార్మికులను మోసం చేయాలని చూస్తున్న కేసీఆర్ మాయమాటలు నమ్మి మళ్ళీ మోసపోవద్దని, ఈ ఎన్నికలలో ఏఐటియుసికే ఓట్లు వేసి ఆయనకు, తెరాస సర్కార్ కు గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రతిపక్ష నేతలు ముగ్గురూ సింగరేణి కార్మికులకు విజ్ఞప్తి చేశారు.