విషపాముకు పాలు పోసి పెంచితే ఏమవుతుంది? అదే జరుగుతోంది పాకిస్తాన్ కి.అది పెంచి పోషించిన ఉగ్రమూకలు దానినే కబళించివేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. అది ఇంతకాలం గట్టిగా వెనకేసుకొచ్చిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ ను అరెస్ట్ చేసి చట్టప్రకారం శిక్షించాలని పాక్ ప్రభుత్వంపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతుండటంతో అతనిని గృహనిర్బంధం చేసి చేతులు దులుపుకోవాలని చూసింది. కానీ అతను పాక్ సర్కార్ కే సవాలుగా మారాడిప్పుడు.
అతను మిల్లి ముస్లీం లీగ్ (ఎం.ఎం.ఎల్.)అనే రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయాలలోకి..ఎన్నికలలో పోటీ చేసి చట్టసభలలోకి ప్రవేశించి అధికారం కైవసం చేసుకోవడానికి సిద్దం అయ్యాడు. సెప్టెంబర్ 17న జరిగిన లాహోర్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉపఎన్నికలలో పోటీ చేసిన ‘ఎం.ఎం.ఎల్.’ అభ్యర్ధికి 5శాతం ఓట్లు పోలవడం పాక్ సర్కార్ ఉలిక్కి పడింది. వెంటనే ఎం.ఎం.ఎల్.కు రాజకీయ పార్టీగా గుర్తింపు ఇవ్వవద్దని కోరుతూ పాక్ ఎన్నికల కమీషనర్ కు ఒక లేఖ వ్రాసింది.
దానిలో లష్కర్, హిజ్బుల్ ముజాహుద్దీన్ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న ఎం.ఎం.ఎల్.కు రాజకీయ పార్టీగా గుర్తింపునిస్తే చాలా ప్రమాదమని పేర్కొంది. ముంబై ప్రేలుళ్ళ కేసులో నిందితుడుగా ఉన్న అతని తలకు అమెరికా ఏకంగా లక్ష డాలర్లు వెలకట్టింది. అతనిని అరెస్ట్ చేయడానికి సహకరించినవారికి ఆ బహుమానం ఇస్తామని ప్రకటించింది. పాక్ ప్రభుత్వం ఈ విషయాలన్నీ ఆ లేఖలో వ్రాసి అటువంటి ప్రమాదకరమైన వ్యక్తి ఆధ్వర్యంలో స్థాపించబడిన ఎం.ఎం.ఎల్.కు గుర్తింపునివ్వవద్దని కోరింది. పాక్ ప్రభుత్వం, ఎన్నికల కమీషన్ ప్రతినిధులు ఈ లేఖను దానిలో పేర్కొన్న అంశాలను దృవీకరించారు.
హఫీజ్ సయీద్ ఒక కరడుగట్టిన ఉగ్రవాది అని తెలిసి ఉన్నప్పటికీ, అతనిని భారత్ పై ఒక అస్త్రంగా ఉపయోగపడుతున్నాడు కనుక ఇంతకాలం పాక్ ప్రభుత్వం అతనిని కాపాడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ప్రభుత్వానికే ఎసరు పెట్టడానికి అతను సిద్దమవడంతో అతను ఒక ఉగ్రవాది..అతని తలపై లక్ష డాలర్లు బహుమతి ప్రకటించబడి ఉంది..అని పాక్ ప్రభుత్వమే చెప్పుకోవలసి వచ్చింది. పాక్ ప్రభుత్వం ఉగ్రవాదులను రక్షిస్తోందనే విషయం దాని లేఖతో బహిర్గతం అయ్యింది. అయినా ముంజేతి కంకణాన్ని చూసుకోనేందుకు అద్దం ఎందుకు? హఫీజ్ సయీద్ ఉగ్రవాది అని చెప్పడానికి లేఖలు, సాక్ష్యాలు కావాలా?