ఒకప్పుడు తెలంగాణా ఉద్యమాలలో కేసీఆర్ తో భుజంభుజం కలిపి పనిచేసిన టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, రాష్ట్రం ఏర్పడి తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ పనితీరును, దాని నిర్ణయాలను విమర్శిస్తున్నారు. తనకు ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడానికి ఏమాత్రం ఆసక్తిలేదని స్పష్టంగా తేల్చి చెప్పినప్పటికీ, ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతలాగ వ్యవహరిస్తున్నారు. మొదట్లో ఆయన ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసేవారు కానీ ప్రభుత్వం వైపు నుంచి స్పందన రాకపోవడంతో, ఇక నేరుగా తెరాస సర్కార్ పేరు పెట్టే విమర్శించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచే కేటిఆర్, హరీష్ రావు, బాల్క సుమన్, కర్నే ప్రభాకర్ వంటి తెరాస నేతలు ఘాటుగా ప్రతిస్పందించడం మొదలుపెట్టారు. అయితే ఇంతవరకు ఏనాడూ కేసీఆర్ నేరుగా ప్రొఫెసర్ కోదండరామ్ ను ఉద్దేశ్యించి విమర్శలు చేయలేదు. ఈరోజు మొట్టమొదటిసారిగా ఆయన కోదండరామ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈరోజు ప్రగతి భవన్ లో విలేఖరులతో మాట్లాడుతూ ఒక ప్రశ్నకు జవాబుగా, “తాడూ బొంగరం లేనివాళ్ళందరూ నోటికి వచ్చినట్లు ఏదో మాట్లాడుతుంటారు. అసలు కోదండరామ్ ఎవరు? దాదాపు మూడున్నర దశాబ్దాలుగా సింగరేణిలో ఒక్క ఉద్యోగం భర్తీ అయ్యిందా? దాని గురించి ఆయన ఎందుకు ప్రశ్నించరు? మేము అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలోనే సింగరేణిలో 5,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చాము. అయినా మేమేదో కార్మికులకు అన్యాయం చేస్తున్నట్లు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇంకా ఉద్యోగాలను సృష్టించడం కోసమే కొత్త భూగర్భ గనులను కూడా ప్రారంభిస్తాము. మేము ఏమి చేస్తామో అదే చెపుతాము. ఏమి చెపుతామో అది తప్పకుండా చేస్తాము. సింగరేణిలో గెలవడం కోసం అబద్ధాలు చెప్పవలసిన అవసరం మాకు లేదు,” అని కేసీఆర్ అన్నారు.