ఆ ఎన్నికలు ఎవరి కోసం?

September 29, 2017


img

సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలలో అధికార తెరాస, ప్రతిపక్ష పార్టీల నేతలు ఉదృతంగా చేస్తున్న ప్రచారం, హోరాహోరీగా సాగుతున్న వారి పోరాటాలు చూస్తుంటే ఈ ఎన్నికలు కార్మిక సంఘాలకు జరుగుతున్నాయా లేక అధికారం కోసం రాజకీయ పార్టీల మద్య జరుగుతున్నాయా? అనే సందేహం కలుగకమానదు. అయితే నవ్వితే నవ్విపోదురుగాక మాకేల సిగ్గు అన్నట్లు అధికార, ప్రతిపక్షాలు జోరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాయి. 

ఈ ఎన్నికలలో విజయం సాధించడం ద్వారా ప్రజలు తమవైపే ఉన్నారని నిరూపించుకోవాలని తెరాస ఆరాటపడుతుంటే, ఈ ఎన్నికలలో తెరాస అనుబంధ తెలంగాణా బొగ్గుగని కార్మిక సంఘాన్ని చావు దెబ్బ తీయడం ద్వారా ప్రతిపక్షాలు తమ సత్తాను చాటుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నాయి. ఆ ప్రయత్నంలో అందరూ కలిసి సింగరేణి కార్మికుల మద్య దూరం పెంచి చిచ్చు రగిలిస్తున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం కార్మికుల మద్య చిచ్చు పెడితే వారు ఎలాగూ నష్టపోతారు పైగా ఒకేచోట కలిసిమెలిసి పనిచేయవలసిన కార్మికులు పార్టీల వారిగా విడిపోయి గొడవలు పడితే సింగరేణి సంస్థ కూడా అందుకు బారీ మూల్యం చెల్లించవలసి వస్తుందని మరిచిపోకూడదు. కార్మిక సంఘాల ఎన్నికలను కూడా తమ బలబలాలను చాటుకొనే వేదికగా మార్చుకొని కార్మికులను పావులుగా వాడుకోవడం సరికాదు. 


Related Post