కేసీఆర్ హెచ్చరికలతో తెరాస నేతలు మేల్కొంటారా?

September 29, 2017


img

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ నేతలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలను, పార్టీ కార్యక్రమాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరించారు. 

మంత్రి మహేందర్ రెడ్డి ఇటీవల తాండూర్ లో తెరాస కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు ఆయూబ్ ఖాన్ అనే తెరాస నేత తెరాసలో తనకు తగిన గుర్తింపు, గౌరవం లభించడంలేదనే ఆవేదనతో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. 

అలాగే దళితులకు మూడెకరాల భూ పంపిణీలో తమకు అన్యాయం జరిగిందని ఆవేదన చెందుతూ కరీంనగర్ కు చెందిన ఎం.శ్రీనివాస్, వైకాపా పరశురాములు అనే ఇద్దరు దళిత యువరైతులు మానకొండూరు తెరాస ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ క్యాంప్ కార్యాలయం ముందు ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోగా వారిలో మహంకాళి శ్రీనివాస్ మృతి చెందాడు. 

మూడు రోజుల క్రితమే తెరాస నేతలు యల్లందు పట్టణ మున్సిపల్ కమీషనర్ రవిబాబుపై దాడి చేయడంతో మున్సిపల్ ఉద్యోగ సంఘాలతో బాటు ప్రతిపక్షాలు కూడా వారిపై తీవ్ర విమర్శలు చేసి, వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ పట్టణంలో నిరసన దీక్షలు చేశారు.    

అంతకు ముందు నేరెళ్ళ ఘటనలో తెరాస నేతలు సకాలంలో స్పందించకపోవడం వలన ప్రభుత్వానికి ఎన్ని సమస్యలు ఎదురయ్యాయో..ఎంత అప్రదిష్ట కలిగిందో అందరూ చూశారు. ఇక జనగామలో తెరాస ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అక్రమాలపై జిల్లా కలెక్టర్ దేవయాని స్వయంగా పిర్యాదులు చేస్తున్న సంగతి తెలిసిందే. 

తెరాస నేతల అశ్రద్ధ వల్లనైతేనేమి లేక అహంకారం వల్లనైతేనేమి వరుసగా జరుగుతున్న ఇటువంటి సంఘటనల వలన తెరాస సర్కార్ చేస్తున్న మంచిపనులకు ఇంకా మంచి పేరుప్రతిష్టలు కలుగకపోగా ప్రభుత్వం పరువు బజారునపడుతోంది. ఆ కారణంగా తెరాస ప్రతిష్ట కూడా మసకబారుతుంది. 

రాష్ట్రమంతటా తెరాస నేతలు, కార్యకర్తలున్నప్పటికీ వారిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిజాయితీగా కృషి చేస్తున్న వారిని వేళ్ళమీద లెక్కించవచ్చు. పైగా వారు ప్రభుత్వానికి, పార్టీకి ఇటువంటి సమస్యలు తెచ్చిపెడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. వారు తమ తమ ప్రాంతాలలో  ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ, అవసరమైనప్పుడు వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి. అలాగే తమ వలన పార్టీకి, ప్రభుత్వానికి మంచిపేరు రాకపోయినా చెడ్డపేరురాకుండా చూసుకోవలసిన బాధ్యత వారిదే. కానీ దానినీ వారు విస్మరించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి ఈవిధంగా హెచ్చరికలు చేయవలసివచ్చింది. ఇటువంటి పరిస్థితులలో అది చాలా అవసరం కూడా. 

మరొక ఏడాదిన్నరలో శాసనసభ ఎన్నికలు వచ్చేస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో తెరాసకు కనీసం 102-106 సీట్లు సాధించాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నప్పుడు, తెరాస మంత్రులు, నేతలు, కార్యకర్తలు అందరూ కూడా అదేస్థాయిలో పనిచేయాల్సి ఉంటుందని మరిచిపోకూడదు. 


Related Post