భారత్ జనాభా సుమారు 130 కోట్లు దాటుతున్నప్పటికీ అత్యవసర పరిస్థితులలో రోగులకు ఎక్కించడానికి అవసరమైన రక్తం సంపాదించడం నేటికీ చాలా క్లిష్టమైన ప్రక్రియగానే ఉంది. ఇక ప్రాణాంతకమైన లుకేమియా వంటి వ్యాధి బారిన పడిన రోగులకు, ఓ పాజిటివ్, ఓ నెగెటివ్ గ్రూప్ రోగులకు అత్యవసరంగా రక్తం కావాలంటే ఇంకా కష్టం అవుతుంది. దేశమంతటా బ్లడ్ బ్యాంక్స్ ఉన్నా వాటిలో రక్తంతో వ్యాపారం చేసేవే ఎక్కువ కనుక అత్యవసర పరిస్థితులలో బోలెడు డబ్బు ధారపోస్తే కానీ అవసరమైన రక్తం లభించదు. ఈ సమస్య ఫేస్ బుక్ దృష్టికి రావడంతో దాని పరిష్కారం కోసం అది తన సామాజిక బాధ్యతగా అక్టోబర్ 1వ తేదీ నుంచి ఫేస్ బుక్ సైట్ లో దీని కోసం ఒక ప్రత్యేక ఆప్షన్ ఏర్పాటుచేయబోతోంది. అత్యవసరంగా రక్తం అవసరమైన వారికి, రక్తదానం చేయాలనుకొనే వారికి మద్య ఆ ఆప్షన్ వారధిగా నిలుస్తుంది.
రక్తం అవసరమైనవారు తమకు కావలసిన రక్తం, దాని గ్రూప్, రోగి వివరాలు, ఆసుపత్రి పేరు, తమ చిరునామా, ఫోన్ నంబర్ వగైరాలను ఈ ఆప్షన్ ద్వారా ఫేస్ బుక్ లో పోస్ట్ చేయవలసి ఉంటుంది.
అలాగే రక్తదానం చేయదలచుకొన్నవారు కూడా తమ బ్లడ్ గ్రూప్, చిరునామా, ఫోన్ నంబర్ వగైరాలను ఈ ఆప్షన్ లో నమోదు చేసుకోవలసి ఉంటుంది.
ఎవరికైనా అత్యవసరంగా రక్తం అవసరమైనప్పుడు ఫేస్ బుక్ లో ఉన్న ఈ ఆప్షన్ వారిని అనుసంధానం చేస్తూ మెసేజ్ పంపిస్తుంది. దీని వలన అత్యవసర పరిస్థితులలో రక్తం అవసరమైనవారికి తమ సమీపంలో ఉండే రక్తదాతలను గుర్తించి రక్తం పొందడం తేలికవుతుంది.
ఇంతవరకు సోషల్ మీడియాను అనేక సందర్భాలలో ఇటువంటి మంచిపనులకు ఉపయోగించినప్పటికీ వాటన్నిటిలోకి ఇదే గొప్ప ప్రయోగం అని చెప్పవచ్చు. ఈ ప్రయోగాన్ని మొదట డిల్లీ, హైదరాబాద్ నగరాలలో అమలుచేసి, దానిలో ఏమైనా లోటుపాట్లు ఉన్నట్లయితే వాటిని సవరించిన తరువాత యావత్ భారతదేశంలో అమలుచేయడానికి ఫేస్ బుక్ సిద్ధం అవుతోంది. ఇటువంటి గొప్ప ఆలోచన చేసి, దానిని అమలుచేయడానికి ముందుకు వచ్చిన ఫేస్ బుక్ ను అభినందించవలసిందే. రండి..అందరం ఫేస్ బుక్ మొదలుపెట్టిన ఈ మహా ఉద్యమంలో పాలు పంచుకొందాము.