భాజపాలో ముసలం..ప్రతిపక్షాలకు సంతోషం

September 28, 2017


img

రాజకీయాల నుంచి నిష్రమించిన నేతలు ఆత్మకధల పేరిట పుస్తకాలో వ్రాస్తూ లేదా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ అందులో సంచలన విషయాలు ప్రస్తావిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నించడం సహజమే. సీనియర్ భాజపా నేత యశ్వంత్ సిన్హా కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు. అయితే అయన తన స్వంతపార్టీపై, స్వంత ప్రభుత్వంపైనే బాణాలు సందిస్తుండటం విశేషం. 

ఇటీవల ఆయన ఒక ప్రముఖ పత్రికకు వ్రాసిన ఒక వ్యాసంలో ఈ మూడున్నరేళ్ళ మోడీ పాలనలో దేశంలో అన్ని రంగాలు తిరోగమిస్తున్నాయని, నోట్ల రద్దు, జి.ఎస్.టి.అమలుతో దేశ ఆర్ధిక వ్యవస్థ కూడా పూర్తిగా చిన్నాభిన్నం అయ్యాయని విమర్శలు గుప్పించారు. కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని విమర్శిస్తూ ఆ వ్యాసం వ్రాసినప్పటికీ అది ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశ్యించి వ్రాసిందేనని అర్ధం అవుతూనే ఉంది. 

సహజంగానే అది కాంగ్రెస్ పార్టీకి చాలా ఆనందం కలుగజేసింది. మీ స్వంతపార్టీలో సీనియర్ నేతే మీ నిర్ణయాలను తప్పు పడుతున్నారని ఎద్దేవా చేసింది. యశ్వంత్ సిన్హా నిరాశానిస్ప్రుహాలతో ఆవిధంగా అంటున్నారని భాజపా దానిని తేలికగా కొట్టిపడేయడానికి ప్రయత్నించిది కానీ వాస్తవానికి చాలా ఇబ్బంది పడుతోంది. 

ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లు తమ ప్రభుత్వంపై యశ్వంత్ సిన్హా చేసిన అనుచిత వ్యాఖ్యలకు సహాయ మంత్రిగా ఉన్న ఆయన కుమారుడు జయంత్ సిన్హా చేత సమాధానం చెప్పించింది. అయన కూడా తమ ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధించుకొంటూ ఒక వ్యాసం వ్రాశారు. 

తన తండ్రిని ఉద్దేశ్యించి “ఇటీవల ఆర్ధిక సంస్కరణలపై వచ్చిన కొన్ని వ్యాసాలు నా దృష్టికి వచ్చాయి. మా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు ఆర్ధిక వ్యవస్థను ఇంకా బలోపేతం చేసేందుకు, దేశంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచేందుకు చాలా దోహదపడుతుంది. స్వల్పకాలిక ఆర్ధిక ఫలితాలను చూసి దీర్ఘకాలిక ఫలితాలను బేరీజు వేయడం సరికాదు,” అంటూ జయంత్ సిన్హా కూడా పెద్ద వ్యాసమే వ్రాశారు. 

విశేషమేమిటంటే దేశ ఆర్ధిక వ్యవస్థ గురించి ఇద్దరు చెప్పిందీ సహేతుకంగానే ఉండటం. నోట్లరద్దు, జి.ఎస్.టి. వలన దేశ ఆర్ధిక వ్యవస్థ పెద్ద కుదుపులకు లోనవుతోందని, కీలక రంగాలన్నీ స్తంభించిపోయాయని యశ్వంత్ సిన్హా చెప్పిన మాట వాస్తవమే. అలాగే ఒక మూడు నాలుగు నెలల ఆర్ధిక ఫలితాలను చూసి దీర్ఘకాలిక ఫలితాలను బేరీజు వేయడం సరికాదనే కొడుకు వాదన సరైనదే. 

మోడీ సర్కార్ చేపట్టిన ఆర్ధిక సంస్కరణల ఫలితాలు కనబడటానికి కనీసం రెండు, మూడేళ్ళు అవుతుంది. అప్పటికి కానీ అవి సత్ఫలితాలు ఇచ్చాయా లేక దేశానికి తీరని నష్టం కలిగించాయా అనేది ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. కానీ ఈలోగా యశ్వంత్ సిన్హా చేస్తున్న ఈ విమర్శల వలన భాజపాకు, మోడీ సర్కార్ కు తీరని నష్టం కలిగే అవకాశం ఉంది. 



Related Post