ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు తన పదవికి రాజీనామా చేసారని, త్వరలో డిల్లీ వెళ్ళి స్పీకర్ కు తన రాజీనామా పత్రాన్ని సమర్పిస్తారని వార్తలు వచ్చాయి. కనుక ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ లోక్ సభ నియోజకవర్గానికి ఉపఎన్నికలు వస్తాయనే నమ్మకంతో తెదేపా నుంచి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేయాలనుకొన్నారు. ఉపఎన్నికలు వస్తే భాజపా ఒంటరిగా బరిలోకి దిగాలనుకొంది. కానీ ఇంతవరకు గుత్తా తన రాజీనామా లేఖను జేబులోనే పెట్టుకొని తిరుగుతున్నారు తప్ప స్పీకర్ కు పంపలేదు. దానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి.
అయన చేత రాజీనామా చేయించి, తెలంగాణా రైతు సమన్వయ సమితికి చైర్మన్ గా నియమించాలని కేసీఆర్ భావించినట్లు సమాచారం. త్వరలో జరుగబోయే శాసనసభ సమావేశాలలో రైతు సమన్వయ సమితికి చట్టబద్దత, కార్పోరేషన్ హోదా కల్పించి ఆయనను చైర్మన్ గా నియమించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈలోగా సింగరేణి ఎన్నికలు కూడా పూర్తవుతాయి కనుక దానిలో ఘన విజయం సాధించి అదే ఊపులో నల్లగొండ ఉపఎన్నికలకు వెళ్ళాలనే మరో ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గుత్తా చేత రాజీనామా చేయించినప్పటికీ ఉపఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనేది ఎన్నికల కమీషన్ చేతిలో ఉంటుంది కనుక ఒకవేళ ఎన్నికలు ఆలస్యం అయితే తొందరపడి రాజీనామా చేసినట్లవుతుంది కనుక రాజీనామా చేయకపోవడమే మంచిదనే ఆభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయిట. కనుక శాసనసభ సమావేశాలు ముగిసే వరకు గుత్తా రాజీనామా కధకు ఎటువంటి ముగింపు ఉంటుందో తెలియదు.