మెట్రో పనులు చూసేందుకు వచ్చినా అడ్డుకోవాలా?

September 27, 2017


img

తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈరోజు జానారెడ్డి, షబ్బీర్ అలీ, దానం నాగేంద్ర తదితర  కాంగ్రెస్ నేతలు లక్డీకాపూల్ వద్ద జరుగుతున్న మెట్రో పనులను చూసేందుకు వెళ్ళారు. కానీ వారికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకొన్నారు. అందుకు నిరసనగా వారు అక్కడే కాసేపు రోడ్డుపై బైటాయించడంతో పోలీస్ కమీషనర్ వారిని అనుమతించారు. 

అనంతరం ఉత్తం కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “మెట్రో రైల్ ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి చెందినది కాదు. ప్రజాధనంతో దానిని నిర్మిస్తున్నారు. దానిని చూసేందుకు మాకు కేసీఆర్ అనుమతి, పోలీసుల అనుమతి ఎందుకు? అయినా ఆ ప్రాజెక్టు పనులు ఏవిధంగా జరుగుతున్నాయో చూడటానికి మేము వస్తే మమ్మల్ని ఎందుకు అడ్డుకొంటున్నారు? రూ.14,000 కోట్లనుకొన్న ఈ మెట్రో ప్రాజెక్టు నేటికీ పూర్తవడం లేదు కానీ ఎప్పటికప్పుడు అలైన్ మెంట్ మార్పులు పేరుతో ఖర్చులు పెంచుకొంటూపోతున్నారు. ఇది ఇంకా ఎప్పటికి పూర్తవుతోందో ఇంకా ఎన్ని వేలకోట్లు ఖర్చు చేస్తారో ఎవరికీ తెలియడం లేదు. వచ్చే ఎన్నికలలో మా పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా తెరాస సంగతి చూస్తాము,” అని ఉత్తం కుమార్ రెడ్డి హెచ్చరించారు.          

2019 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందా రాదా..వస్తే తెరాస సంగతి చూస్తుందా లేదా? అనే విషయం పక్కన పెడితే, మెట్రో రైల్ ప్రాజెక్టును సందర్శించడానికి వచ్చిన ప్రతిపక్ష నేతలను అడ్డుకోవలసిన అవసరం ఏమిటి? తద్వారా అక్కడ ఏదో అక్రమాలు జరిగిపోతున్నాయని, వాటిని దాచిపుచ్చేందుకే ఎవరినీ ఆ ప్రాజెక్టు సందర్శించనీయడం లేదనే తప్పుడు సంకేతాలు ప్రజలకు పంపినట్లయింది కదా? ఈవిధంగా ఎక్కడికక్కడ ప్రతిపక్షాలను అడుగు కదపనీయకుండా అడ్డుపడటం వలన వారికి ప్రభుత్వమే స్వయంగా ఆయుధాలు అందించి తమపై విమర్శలు, ఆరోపణలు చేయడానికి ఆస్కారం కల్పించినట్లవుతోందని గ్రహిస్తే మంచిది.     



Related Post