తాలీబాన్ ఉగ్రవాదుల చేతిలో సర్వనాశనం అయిన ఆఫ్ఘానిస్తాన్ కు భారత్ స్నేహహస్తం అందించి చాలా ఏళ్లుగా ఆ దేశ పునర్నిర్మాణంలో చురుకుగా పాలుపంచుకొంటోంది. కనుక భారత్ కు ఆ దేశంలోని పరిస్థితులు బాగా తెలుసు. భారత్ ఎలాగూ ఆ దేశంలో పనిచేస్తోంది కనుక దాని సేనలను కూడా రప్పించి ఆ మేరకు తమ భారాన్ని తగ్గించుకోవాలని అమెరికా భావించింది. అందుకే భారత్ అడిగిందే తడువుగా ఏమి కావాలన్నా చేస్తోంది. భారత్ పట్ల చాలా సానుకూలంగా వ్యవహరిస్తోంది. కానీ అమెరికా ఆలోచనలను పసిగట్టిన మోడీ సర్కార్, తాము ఆఫ్ఘనిస్తాన్ నిర్మాణంలో పాలుపంచుకొంటామే తప్ప తమ సైన్యాన్ని పంపించబోమని స్పష్టంగా ప్రకటించింది. ప్రస్తుతం డిల్లీకి వచ్చిన అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మ్యాటిన్ కు భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఇదే విషయం స్పష్టంగా చెప్పారు. అయితే ఆయన భారత్-అమెరికాల మధ్య ఎఫ్-16 యుద్ద విమానాల సరఫరా, వాటిని భారత్ లో తయారుచేయడం గురించి చర్చించడానికి వచ్చారని అధికారులు చెప్పారు.
ఆఫ్ఘనిస్తాన్ లో గత రెండున్నార దశాబ్దాలుగా అమెరికన్ సైనికులు తాలిబాన్లతో పోరాడుతూ మరణిస్తునే ఉన్నారు. అప్పటి నుంచి నిత్యం అమెరికన్ సైనికుల శవపేటికలు విమానాలలో అమెరికాకు తిరిగి వెళుతూనే ఉన్నాయి. ఒకవేళ అమెరికాను ప్రసన్నం చేసుకోవడానికి భారత్ తన సేనలను ఆఫ్ఘనిస్తాన్ పంపించడానికి అంగీకరించి ఉండి ఉంటే, భారత్ సైనికులకు అమెరికన్ సైనికుల గతే పట్టి ఉండేది. కనుక మోడీ సర్కార్ అమెరికా ట్రాప్ లో పడకుండా తప్పించుకొని మన సైనికుల ప్రాణాలు కాపాడిందని చెప్పవచ్చు.